surgical-strike-loc‘సర్జికల్ స్ట్రైక్స్’ చేసిన భారత్, దాని గురించి ఓ ప్రకటన చేసి మౌనంగా ఉంది. కానీ, పాకిస్థాన్ మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని నిరూపించేందుకు నానాతంటాలు పడుతోంది. లోలోపల వాస్తవం అంగీకరిస్తున్నా… అహం అడ్డం రావడంతో పాక్ పాత పాటే పాడుతోంది. దీంతో రంగంలోకి దిగిన మీడియా పాకిస్థాన్ కు చెందిన వ్యక్తులతోనే ‘సర్జికల్ స్ట్రైక్స్’పై కూపీ లాగాలని నిర్ణయించుకుంది. దీంతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. అందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్పూర్ రేంజికి చెందిన స్పెషల్ బ్రాంచి ఎస్పీ అయిన గులాం అక్బర్ కు ఫోన్ చేసి సర్జికల్ స్ట్రైక్స్ నిజమేనా? ఎలా? జరిగాయి? ఏ సమయంలో జరిగాయి? మన ఆర్మీ ఎలా స్పందించింది? అంటూ ప్రశ్నల వర్షం గుప్పించారు.

దీంతో జరిగిన ఘటన మొత్తం ఆయన వివరంగా పూసగుచ్చినట్లు వివరించారు. “సర్.. అది రాత్రి సమయం. ఒక్కసారిగా కాల్పులు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జరుగుతూనే ఉన్నాయి. సుమారు 3 నుంచి 4 గంటల పాటు కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఒక్కసారిగా దాడులు ప్రారంభం కావడంతో పాకిస్థానీ సైనికులకు ఏం చేయాలో దిక్కు తోచలేదు. వారు తేరుకునే లోపే ఐదుగురు సైనికులు తూటాలకు బలయ్యారు. ఉగ్రవాదులు కూడా పెద్ద ఎత్తునే చనిపోయారు, అందరి మృతదేహాలను ట్రక్కులో వేసుకుని పాక్ సైన్యం వెళ్లిపోయింది. అయితే ఎంతమంది ఉగ్రవాదులు మరణించారో మాత్రం లెక్క సరిగ్గా తెలీదు” అన్నారు.

అంతేకాదు భారత సైన్యం దాడులు జరిపిన ప్రాంతాల పేర్లు కూడా చెప్పడం విశేషం. సర్జికల్ స్ట్రైక్స్ తరువాత తేరుకున్న పాకిస్థానీ సైన్యం ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టిందని అన్నారు. అందులో భాగంగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్ లో ప్రవేశించడానికి పాకిస్థాన్ సైన్యం సాయం చేస్తోందని, ఉగ్రవాదులను ఆర్మీయే తీసుకొస్తుందని, వారిని ఆర్మీయే కాపాడుతుందని, కనీసం తమకు కూడా వారి వివరాలు తెలియవని ఆయన పేర్కొన్నారు. జీహాదీల వివరాలు కేవలం ఆర్మీకి తప్ప ఇంకెవరికీ తెలియదని చెప్పడం విశేషం.