pakistani-bowler-wahab-riaz-misses-his-run-up-five-times-in-a-rowక్రికెట్ లో అద్భుతాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి ఓ అద్భుతం మాత్రం ఇంతకుముందు ఎప్పుడు జరిగి ఉండదు, అలాగే మున్ముందు మరెప్పుడూ కూడా జరగకపోవచ్చు. ఒక బంతిని వేయడానికి ఏదైనా ఒక బౌలర్ ఎంత సమయం తీసుకుంటారు? అది కొద్ది సెకన్ల వ్యవధి మాత్రమే అన్న విషయం క్రికెట్ పరిజ్ఞానులకు తెలిసిందే. కానీ పాకిస్తాన్ కు చెందిన వహాబ్ రియాజ్ ఒక బంతి వేయడానికి ఏకంగా మూడు నిముషాలకు పైనే తీసుకోవడం విశేషం.

సినిమాలలో రిహార్సల్స్ మాదిరి అయిదు టేక్ లు తీసుకున్న తర్వాత ఆరో టేక్ కు ఓకే చెప్పినట్లు… అయిదు సార్లు ప్రయత్నించి, ఆరో సారి బంతిని వదిలాడు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 112వ ఓవర్ వేస్తున్న వహాబ్, 111.4 వద్ద బౌలింగ్ కోసం రన్నప్ చేయడం, చివరికి క్రీజు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి, మళ్ళీ రన్నప్ చేయడంతో ఎంపైర్ తో సహా అందరూ విసుగు చెందారు. పాకిస్తాన్ కోచ్ అయితే నాలుగు సార్లు చూసిన తర్వాత ఆగ్రహంతో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయారు. బ్యాట్స్ మెన్ కరుణరత్నే 165 పరుగులతో ఆడుతుండగా వహాబ్ ఈ బీభత్సమైన ఫీట్ చేసారు.

గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన చోటు చేసుకోకపోవడంతో సోషల్ మీడియాలో వహాబ్ వీడియో వైరల్ గా మారింది. అయితే ఇదే వహాబ్ రియాజ్ రెండవ ఇన్నింగ్స్ లో శ్రీలంకకు ముచ్చెమటలు పట్టిస్తూ తొలి 3 ఓవర్లలోనే మూడు వికెట్లు నేలకూల్చాడు. మొదటి ఇన్నింగ్స్ లో 220 పరుగుల లీడ్ తో రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 34 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పతనంలో వహాబ్ రియాజ్ 3.3 ఓవర్లు వేసి 10 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లతో కీలక పాత్ర పోషించాడు.