Pakistan vs UAE, Asia Cup T20 2016 Match ఆసియా కప్ లో ఇప్పటికే ఇండియా చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ దాదాపుగా మళ్ళీ ఖంగుతిన్నంత పని చేసింది. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో 130 పరుగుల స్వల్ప లక్ష్యం ముందు బోర్లా పడుతుందనుకున్న పాకిస్తాన్ ను ఉమర్ అక్మల్ (50), షోయబ్ మాలిక్ (63) అర్ధ సెంచరీలతో గట్టెంక్కించారు. తొలి మూడు ఓవర్లలో 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ పాక్ ను మరో వికెట్ పడకుండా విజయం వైపుకు తీసుకెళ్ళడంలో ఉమర్ అక్మల్, షోయబ్ మాలిక్ సక్సెస్ అయ్యారు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టును అన్వర్ (42 బంతుల్లో 46 పరుగులతో) ఆదుకున్నాడు. ఒక దశలో సగం ఓవర్లు ముగిసిపోయి 41 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయిన జట్టును 129 పరుగుల దాకా తీసుకెళ్లడంలో అన్వర్ (46), ఉస్మాన్ (21), జావేద్ (27), నవీద్ (10)లు దోహదం చేసారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో తమ ప్రతిభ చూపిన యూఏఈ జట్టు ఫీల్డింగ్ లో మాత్రం పేలవమైన ప్రదర్శన కనపరిచింది.

మ్యాచ్ కీలక దశలో ఉన్నపుడు షోయబ్ మాలిక్ ఇచ్చిన తేలిక క్యాచ్ ను పట్టుకోలేక మ్యాచ్ ను పాక్ వశం చేసింది పసికూన జట్టు. అలాగే, చివరి ఓవర్లలో వరుసగా ఫుల్ టాస్ బాల్స్ సంధించి పరాజయాన్ని చేతులారా తెచ్చుకోవడంలో యూఏఈ జట్టు సఫలీకృతమైంది.