Pakistan-Vs-Team-India-ICC-Champions-Trophy-2017వరుణ దేవుడు ఇచ్చిన ఎన్నో ట్విస్ట్ ల నడుమ ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ విజయవంతంగా ముగిసింది. మ్యాచ్ పూర్తిగా సాగుతుందా… లేదా… అన్న మీమాంసలో ఉన్న క్రీడాభిమానులకు, చివరికి అవలీలమైన ఇండియా విజయం మరింత ఉత్సాహాన్ని పంచింది. ఇండియా – పాక్ మ్యాచ్ అంటే రసవత్తరంగా సాగుతుందని భావించిన క్రికెట్ ప్రేమికులకు, ‘వార్ వన్ సైడ్’ కావడంతో కాస్త నిరుత్సాహాపడినా, టీమిండియా తిరుగులేని విజయంతో, ‘సూపర్’ నెట్ రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో గ్రూప్ బిలో అగ్ర స్థానంలో నిలిచింది.

నిజానికి ఈ మ్యాచ్ లో పాక్ తీసుకున్న తొలి నిర్ణయమే తమ ఓటమిని కొనితెచ్చుకున్నట్లయ్యింది. ఇండియాతో మ్యాచ్ అంటే ఎంత ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ప్రస్తుతం టీమిండియా బ్యాట్స్ మెన్లు ఏ రేంజ్ లో ఫాంను ప్రదర్శిస్తున్నారో కూడా ప్రపంచానికి తెలిసిన విషయమే. మరి అలాంటి సమయంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతోనే పాకిస్తాన్ వ్యూహం బెడిసికొట్టిందన్న సంకేతాలు కనిపించాయి. దానిని నిరూపించే విధంగా క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్ మెన్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

ఓపెనర్లు బలమైన భాగస్వామ్యాన్ని అందించడంతో మిడిల్ ఆర్డర్, దానిని లబ్ది పొందగలిగింది. శిఖర్ ధావన్ 68 పరుగులు చేసి ఔటైన తర్వాత నింపాదిగా ఆడిన రోహిత్ శర్మ – విరాట్ కోహ్లిల జోడి భారీ స్కోర్ కు బాటలు వేసారు. రోహిత్ (91) సెంచరీ ముంగిట ఔటైనప్పటికీ, క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ చెలరేగిపోయాడు. 32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 53 పరుగులు చేసి సత్తా చాటగా, కెప్టెన్ విరాట్ కోహ్లి 68 బంతుల్లో 81 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక చివర్లో వచ్చిన పాండ్య 6 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టి 20 పరుగులు నమోదు చేయడంతో… 48 ఓవర్లలో టీమిండియా 319 పరుగులు చేసింది.

ఇక భారీ లక్ష్య చేధనలో మళ్ళీ వరుణుడు ప్రత్యక్షం కావడంతో, పాక్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా నిర్దేశించగా, ఏ దశలోనూ పాక్ దానిని అందుకునే విధంగా బ్యాటింగ్ చేయకపోవడం విశేషం. టీమిండియా బౌలర్ల ధాటికి 33.4 ఓవర్లలో కేవలం 164 పరుగులకు ఆలౌటై, 124 పరుగుల భారీ విజయాన్ని టీమిండియాకు సమర్పించుకుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ సెమీస్ కు చేరాలంటే ఏదొక అద్భుతం జరగాల్సిందే. ఈ భారీ ఓటమితో నెట్ రన్ రేట్ -3కు పైగా ఉండడంతో, దాదాపుగా పాక్ అవుట్ ఆఫ్ టోర్నీ అని భావించవచ్చు.

ఒకే ఒక్క మ్యాచ్ తో ఛాంపియన్స్ ట్రోఫీపై పాకిస్తాన్ పెట్టుకున్న ఆశలన్నీ నీరుగార్చేసింది టీమిండియా. అలాగే పాక్ పై కొట్టిన ఈ విజయంతో టీమిండియా నెట్ రన్ రేట్ కూడా మిగిలిన అన్ని జట్ల కంటే ఎక్కువగా ఉండడంతో, శ్రీలంక, దక్షిణాఫ్రికాలతో జరిగే రెండు మ్యాచ్ లలో కనీసం ఒక్కటి గెలిచినా, ఖచ్చితంగా సెమీస్ కు చేరుకుంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే సఫారీలు శ్రీలంకను పడగొట్టి 2 పాయింట్లు నమోదు చేసుకుని, రెండవ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. మొత్తానికి టోర్నీ హైలైట్ గా భావించిన మ్యాచ్ ను టీమిండియా ‘వన్ సైడ్’గా మార్చేసింది.