Pakistan Vs Sri Lanka Test Matchటెస్ట్ మ్యాచ్ మజా ఏంటో మరోసారి శ్రీలంక – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ రుచిచూపించింది. నాలుగవ ఇన్నింగ్స్ లో కేవలం 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు, ఉత్కంఠభరితమైన క్షణాల నడుమ 114 పరుగులకు ఆలౌట్ కావడంతో, 21 పరుగుల తేడాతో శ్రీలంక జట్టు జయకేతనం ఎగురవేసింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టులో ఓపెనర్ కరునరత్నే 93, చండిమాల్ 155, డిక్ వెల్లా 83 పరుగులతో రాణించడంతో 419 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది.

శ్రీలంక స్కోర్ కు తగ్గట్లే పాకిస్తాన్ కూడా సమిష్టి కృషి చేసి 422 పరుగులు చేసింది. ఓపెనర్లు షాన్ మసూద్ 59, సమి అస్లాం 51 శుభారంభాన్ని అందించగా, మిడిల్ ఆర్డర్ లో అజర్ అలీ 85, హారిస్ సోహలి 76 రాణించడంతో శ్రీలంక కంటే ఓ మూడు పరుగులకు ఎక్కువగానే చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో శ్రీలంక జట్టు కేవలం 138 పరుగులకే కుప్పకూలడంతో పాక్ విజయం ఖాయం అనుకున్నారు. యాసిర్ షా 5 వికెట్లతో సత్తా చాటి శ్రీలంక పతనానికి కారణమయ్యాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ను స్పిన్నర్ హేరేత్ 6 వికెట్లతో బెంబేలేత్తించాడు.

పాకిస్తాన్ అవలీలగా గెలుస్తుందని భావించిన ఈ మ్యాచ్ ను శ్రీలంక వైపుకు మలుపు తిప్పిన హేరేత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. హేరేత్ కు పెరేరా 3 వికెట్లతో మంచి సహకారం అందించాడు. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ ముగిసే సమయానికి 1-0 ఆధిక్యంలో శ్రీలంక జట్టు ఉంది. నాలుగవ రోజు నుండి పిచ్ బౌలింగ్ కు అనుకూలించడంతో రెండవ ఇన్నింగ్స్ లో రెండు జట్లు స్వల్ప స్కోర్లకే పరిమితం కాగా, లక్ష్య చేధనలో తమ జట్టుకున్న వీక్ నెస్ ను పాకిస్తాన్ మరోసారి బయటపెట్టుకున్నట్లయ్యింది.