Pakistan vs Australiaబ్రిస్బేన్ వేదికగా ప్రారంభమైన ఆస్ట్రేలియా – పాకిస్తాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. మరో విధంగా చెప్పాలంటే… చక్కని పోరాటపటిమను కనపరిచి, ఆతిధ్య ఆస్ట్రేలియా జట్టుకు ముచ్చెమటలు పట్టించింది. 490 పరుగుల భారీ లక్ష్యంతో నాలుగవ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన పాకిస్తాన్, 450 పరుగులు సాధించి ఆలౌట్ అయ్యింది. దీంతో ‘చావుతప్పి కన్ను లోట్టబోయిందన్న’ చందంగా 39 పరుగులతో ఆసీస్ విజయం సాధించింది.

నిజానికి పాకిస్తాన్ జట్టు నుండి ఈ స్థాయి పోరాటపటిమ ఆశించింది కాదు. దీంతో పాకిస్తాన్ కనపరిచిన ఆటతీరును చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక్కసారి స్కోర్ బోర్డు వివరాలను పరిశీలిస్తే… ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 429 పరుగులు చేయగా, పాకిస్తాన్ కేవలం 142 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో ఫాలో ఆన్ ఇవ్వకుండా సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసిన తర్వాత డిక్లేర్ చేసింది.

దీంతో 490 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్, తొలి వికెట్ ను 31 పరుగుల వద్ద సమి అస్లాం (15) రూపంలో కోల్పోయింది. అలాగే వన్ డౌన్ బ్యాట్స్ మెన్ బాబర్ అజాం (14) పరుగులకు అవుట్ కాగా, మరో ఓపెనర్ అజార్ అలీ (71) పరుగులతో రాణించాడు. అలాగే సీనియర్ బ్యాట్స్ మెన్ యూనిస్ ఖాన్ (65) కూడా తన వంతు చేయి వేయగా, కెప్టెన్ మిస్బా ఉల్ హక్ మాత్రం (5) పరుగులు చేసి నిరాశపరిచాడు.

దీంతో 173 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ వెనువెంటనే కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా (24) పరుగులు చేసి అవుట్ కావడంతో, పాకిస్తాన్ ఘోరఓటమి తధ్యం అనుకున్న తరుణంలో… అసద్ షఫీక్ – మొహమ్మద్ అమీర్ జోడి ఆసీస్ కు చెమటలు పట్టించే కార్యక్రమం చేపట్టారు. బౌలర్ అమీర్ 63 బంతుల్లో 48 పరుగులు చేసి అవుట్ కావడంతో, వీరిద్దరి 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మరో ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ కూడా తన వంతుగా 56 బంతుల్లో 30 పరుగులు చేసి, అసద్ తో కలిసి 66 పరుగులు జోడించారు. 378 పరుగుల వద్ద 8 వికెట్ గా రియాజ్ వెనుదిరగగా, క్రీజులోకి యాసిర్ షా వచ్చి, ఆసీస్ వెన్నులో వణుకు పుట్టించాడు. ఓ పక్కన అసద్ షఫీక్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజులో పాతుకుపోగా, మరో పక్కన టైల్ ఎండర్స్ పూర్తి సహకారం అందిస్తుండడంతో, పాకిస్తాన్ విజయపు తీరాలకు చేరేలా కనిపించింది.

వీరిద్దరూ కలిసి 9వ వికెట్ కు 71 పరుగులు జోడించగా, జట్టు స్కోర్ 449 పరుగులకు చేరింది. దీంతో మ్యాచ్ అంతా ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఈ తరుణంలో స్టార్క్ వేసిన ఓ అద్భుతమైన బంతికి సెంచరీ వీరుడు అసద్ షఫీక్ 137 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో పాకిస్తాన్ జట్టుతో పాటు క్రికెట్ అభిమానులు కూడా నిరుత్సాహంలో పడ్డారు. ఆసీస్ కు భంగపాటు ఖాయం అనుకున్న తరుణంలో అసద్ అవుట్ కావడంతో కంగారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక, చివరి వికెట్ ను యాసిర్ షా తనకు తానుగా రనౌట్ రూపంలో ఆసీస్ కు సమర్పించుకోవడంతో షాక్ నుండి తేరుకుని, విజయపు సంబరాలను చేసుకుంది. నాలుగవ ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన నాలుగవ జట్టుగా పాకిస్తాన్ జట్టు రికార్డులకెక్కింది. 490 పరుగుల లక్ష్య చేధనలో అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభను కనపరిచిన సెంచరీ వీరుడు అసద్ షఫీక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఆసీస్ నిలిచింది.