Padmavati Trailer Talkబాలీవుడ్ ‘బాహుబలి’గా కొనియాడుతున్న “పద్మావతి” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. టైటిల్ రోల్ లో దీపికా పదుకునే కనిపిస్తుండగా, షాహిద్ కపూర్ మరియు రణవీర్ సింగ్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలి నుండి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో… సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. మరి ఆ అంచనాలను “పద్మావతి” ట్రైలర్ అందుకుందా? అంటే… ‘బాహుబలి’ అండ్ ‘బాజీరావు మస్తానీ’ సినిమాలను మరిచిపోతే బాగానే ఉంటుంది గానీ, ఆ రెండింటిని గుర్తు తెచ్చుకుంటే మాత్రం ఈ ట్రైలర్ లో గ్రాండ్ విజువల్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తప్ప ఏం లేదన్న భావన కలుగుతుంది.

ఎన్నో వివాదాల నడుమ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే రాణి పద్మావతి దేవిగా దీపిక లుక్ అదిరింది. అయితే గతంలో దీపిక నటించిన ‘బాజీరావు మస్తానీ’ సినిమాలో కూడా ఇదే లుక్ తో కనిపించిన విషయం తెలిసిందే. రాజుగా షాహిద్ కపూర్ ఓకే అనిపించగా, రణవీర్ సింగ్ మాత్రం మరోసారి తనదైన మార్క్ తో సిల్వర్ స్క్రీన్ పై చెలరేగడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనపడుతున్నాడు. మూడు నిముషాలకు పైగా సాగిన ఈ ట్రైలర్ లో సంజయ్ లీలా భన్సాలి టేకింగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన హైలైట్స్ గా చెప్పవచ్చు. విజువల్స్ రీచ్ గా ఉన్నప్పటికీ యుద్ధ సన్నివేశాల షాట్స్ మాత్రం నిరాశకలిగిస్తాయని చెప్పవచ్చు.

ముఖ్యంగా ‘బాహుబలి 2’ గ్రాఫిక్స్ తో పోలిస్తే… ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కంటికి ఇంపుగా అనిపించవు. లాంగ్ షాట్స్ లో క్లియర్ గా తెలిసిపోతుండగా, అక్కడక్కడ మాత్రం పర్వాలేదనిపించే విధంగా ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే… ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గ్రాఫిక్స్ మాదిరి కనపడుతున్నాయి తప్ప, ‘బాహుబలి’ రేంజ్ లో అయితే లేవన్నది స్పష్టం. ఇక కధను పెద్దగా రివీల్ చేయనప్పటికీ, రణవీర్ – షాహిద్ కపూర్ ల మధ్య యుద్ధ సన్నివేశాలే హైలైట్ గా ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చెప్తోంది. అయితే ఇలాంటి సినిమాలను అద్భుతంగా తీయడంలో సంజయ్ లీలా భన్సాలిది అందెవేసిన చేయి గనుక, ఆయనపైనే ట్రేడ్ వర్గాలు విశ్వాసం పెట్టుకున్నాయి.