Padmaavat releaseసంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తయారైన ‘పద్మావత్’ చిత్రానికి మార్గం సుగమం కానుంది. ఈ చిత్రాన్ని తాము విడుదలకు ముందే చూడబోమని, అసలు సినిమా విడుదలకు అంగీకరించే ప్రసక్తే లేదని నిన్నటివరకూ భీష్మించుకుని కూర్చున్న కర్ణిసేన, రాజ్ పుత్ వర్గాలు ఓ మెట్టు దిగాయి. సినిమాను విడుదలకు ముందే చూసి అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పాలని, వాటిని తొలగిస్తామని సంజయ్ లీలా భన్సాలీ లేఖను రాయడంతో, ఆపై కాసేపటికే తాము సినిమాను చూస్తామని కర్ణిసేన చీఫ్‌ లోకేంద్ర సింగ్‌ కల్వి ప్రకటించారు.

తనతో పాటు ఉద్యమ బృందంలో ఉన్న మరికొందరు కూడా సినిమాను చూస్తారని ఆయన అన్నారు. తాము చిత్రాన్ని చూడాలని భన్సాలీ కోరారని, ఆయన కోరికను అంగీకరిస్తున్నామని, సినిమా చూసిన తరువాత దీని విడుదలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తాము చూశాకే ‘పద్మావత్’ను దేశ వ్యాప్తంగా విడుదల చేసుకోవచ్చా? కొన్ని రాష్ట్రాల్లో ఆపాలా? అనే విషయం చెబుతామని తెలిపారు. తమతో పాటు సెన్సార్‌ బోర్డు నుంచి ముగ్గురు మాత్రమే సినిమా ప్రదర్శనకు హాజరు కావాలని, వారితో పాటు తాము ఎంపిక చేసిన జర్నలిస్టులకు కూడా సినిమాను చూపించాలని కల్వీ కోరారు.