Paderu MLA Giddi Eswari Joining TDP!విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి(వైకాపా) ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి అమరావతి చేరుకున్న ఆమెకు పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే వైకాపాలో కొందరు నేతల వ్యవహార శైలి ఏకంగా పార్టీ నుంచి బయటకి వెళ్లే పరిస్థితి వచ్చింది.

ఆమె అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దుస్థితి ఆ పార్టీ పెద్దలకు తలెత్తింది. తన గురించి చేసిన వ్యాఖ్యలున్న వాయిస్‌ రికార్డులు కూడా ఎమ్మెల్యే వద్ద ఉండడం తీవ్ర దుమారం రేపుతోంది. పాడేరు ఎమ్మెల్యేగా గౌరవనీయ స్థానంలో ఉన్న ఆమెను రాజ్యసభ ఎన్నికల అనంతరం పక్కన పెట్టేయడమేనని, ఆమె సీటును వచ్చే ఎన్నికల్లో వేరొకరికి ఇవ్వనున్నట్లు సాక్షాత్తూ విజయసాయిరెడ్డే చెప్పినట్లు అరకులోని కొందరికి నగరంలోని ఇద్దరు నేతలు వివరించారు.

దీంతోపాటు ఆ ఇద్దరు నేతలు కొద్దిరోజుల కిందట అరకు వెళ్లినప్పుడు కూడా ఈశ్వరి రాజకీయ ప్రత్యర్థి కుంభా రవిబాబుకు అరకు టిక్కెట్‌ను ఇవ్వబోతున్నట్లు కూడా పేర్కొన్నారు. పార్టీలో ఉంటే ఇక భవిష్యత్తు లేదని అర్థమై పార్టీలోంచి వెళ్లిపోవాలని తీర్మానించుకున్నారు. తనను బుజ్జగించడానికి వచ్చిన విజయసాయిరెడ్డికి వాయిస్‌ రికార్డులను వినిపించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.

ఆ వాయిస్ రికార్డులో విజయసాయిరెడ్డి పేరును కూడా ఇరికించడంతో ఆయనకు ఏవిధంగా స్పందించాలో కూడా అర్థంకాని పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. దీనితో ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. ఇప్పుడు ఆ వాయిస్ రికార్డులు బయట పెట్టి గిడ్డి ఈశ్వరి ఎస్టీ కార్డు వాడితే అది పార్టీకి చాల ఇబ్బందికరంగా మారుతుందని ఆ పార్టీ నేతలు బెంబేలు ఎత్తుతున్నారు.