MLA-Roja-Selvmaniఏపీ పర్యాటకశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలయినా రోజమ్మ ఏనాడూ విశాఖకు వచ్చి అక్కడ పర్యాటకం అభివృద్ధి గురించి అధికారులతో చర్చించలేదు. కానీ విశాఖను రాజధానిగా చేయకపోతే నగరానికి, ఉత్తరాంద్ర జిల్లాలకు కూడా అన్యాయం జరిగిపోతుందంటూ మొన్న శనివారం విశాఖలో జరిగిన విశాఖ గర్జన సభలో మొసలి కన్నీళ్ళు కార్చారు. అయితే ఇక్కడ విశాఖలో శివంగిలా ఆమె గర్జించినప్పటికీ అక్కడ ఆమె సొంత నియోజకవర్గం నగరిలోని కన్నీళ్ళు పెట్టుకొనే పరిస్థితి ఎదురైంది.

నగరి నియోజకవర్గం పరిధిలోని నిండ్ర మండలంలోని కొప్పేడులో ఆమె వ్యతిరేకవర్గం ఆదివారం రైతు భరోసా కేంద్రానికి భూమిపూజ చేసేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌ కెజె శాంతి, నగరి మున్సిపల్ మాజీ ఛైర్మన్‌ కెజె కుమార్‌ తదితరులున్నారు. వారందరూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వర్గానికి చెందినవారు.

వారు మంత్రి రోజా లేకుండా భూమిపూజ చేసేయడంతో నగరి వైసీపీలో వర్గవిభేధాలు మరోసారి బయటపడ్డాయి. వాస్తవానికి ఆమె మంత్రికాక ముందు నుంచే జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వర్గానికి ఆమె వర్గానికి మద్య విభేధాలున్నాయి. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు ఆమె మంత్రి అయిన తర్వాత రెండు వర్గాల మద్య విభేధాలు ఫ్లెక్సీ బ్యానర్లు చించుకొనేంత వరకు వెళ్ళాయి. రోజాని ఆహ్వానించకుండా భూమిపూజ చేయడం ద్వారా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆమె నియోజకవర్గంలో పట్టు పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

అయితే టిడిపి నేతలపై శివంగిలా విరుచుకుపడే మంత్రి రోజా ఈ ఘటనపై అంతే ధీటుగా స్పందించలేక కన్నీళ్ళు పెట్టుకొని మాట్లాడటం విశేషం. ఆమె తన నియోజకవర్గంలో కార్యకర్తలకు పంపిన ఓ ఆడియో సందేశం లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దానిలో ఆమె “మంత్రినైన నన్ను నా నియోజకవర్గంలో బలహీనపరిచి టిడిపి, జనసేనలు నవ్వుకొనేవిదంగా ఆ పార్టీలకు లాభం, మన పార్టీకి నష్టం కలిగించే విదంగా, మన పార్టీని దిగజారుస్తూ వీళ్ళు భూమిపూజ చేయడం ఎంతవరకు కరెక్ట్?మీరంతా ఆలోచించాలి. ఇలాంటివాళ్లు కంటిన్యూ అయితే నేను రాజకీయాలు చేయడం చాలా కష్టం. మేము పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తుంటే, ప్రతీరోజు మాకు మెంటల్ టెన్షన్ పెడుతూ పార్టీకి నష్టం కలిగిస్తున్న వీళ్ళని పార్టీ నాయకులని ఎంకరేజ్ చేయడం కూడా బాధేస్తుంది,” అని మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

Watch and Subscribe for Exclusive Industry Interviews: