outsouring workers dharna about their salariesజగన్ ప్రభుత్వం హడావుడిగా పాఠశాలల విలీనం చేయడంతో ఊహించని సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు మున్సిపల్ పాఠశాలలన్నిటినీ విద్యాశాఖకు అప్పగించి మున్సిపల్ శాఖ చేతులు దులుపుకొంది. వాటిలో పనిచేస్తున్న బోధనేతర, అవుట్ సోర్సింగ్ సిబ్బంది విద్యాశాఖ పరిధిలోకి వెళతారని ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ ఏర్పాట్లు చేసుకొనే వరకు బోధనేతర సిబ్బంది మున్సిపల్ పరిధిలోనే ఉంటారని ఉత్తర్వులలో పేర్కొంది. అయితే స్వీపర్లు, వాచ్ మ్యానులు వంటి అవుట్ సోర్సింగ్‌ సిబ్బందికి ఎవరు జీతాలు చెల్లించాలో ఆ ఉత్తర్వులలో పేర్కొనలేదు.

దాంతో వారి జీతాల బాధ్యత తమది కాదని విద్యాశాఖ చెపుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కూడా వారికి జీతాలు చెల్లించే బాధ్యత తమది కాదని తప్పించుకొంటున్నాయి. దీంతో వారు పాఠశాలలకు వెళ్ళి హెడ్-మాస్టర్లను నిలదీస్తున్నారు. “మీరే కదా మాచేత పనులు చేయించుకొంటున్నారు కనుక మీరే మా జీతాలు చెల్లించాలి…,” అంటూ నిలదీస్తున్నారు. దీంతో హెడ్ మాస్టర్లు తలలు పట్టుకొంటున్నారు.

జూలై నెల జీతాలు చెల్లించకపోవడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మున్సిపల్ పాఠశాలలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు సోమవారం మంగళగిరిలోని డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎదుట ధర్నా చేసి తక్షణం తమ జీతాలు చెల్లించాలని, తమ జీతాల చెల్లింపులో తలెత్తిన ఈ సమస్యకు శాస్విత పరిష్కారం చూపాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

ఏళ్ళ తరబడి నామమాత్రపు జీతాలతో పనిచేస్తున్న తమను విద్యాశాఖలో తీసుకొని రెగ్యులర్ చేస్తారనుకొంటే జీతాలు కూడా ఇవ్వకుండా విద్యాశాఖ, మున్సిపల్ శాఖ అధికారులు ముప్పతిప్పలు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలలో 138 మంది, గుడివాడలో 36 మంది అవుట్ సోర్సింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. ఆ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. వారందరూ ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. వారేమీ బోనసులు, సంక్షేమ పధకాలు ఇమ్మనమని అడగడం లేదు. చేసిన పనికి జీతాలు ఇమ్మనమని మాత్రమే అడుగుతున్నారు. వారికి జీతాలు ఎవరిస్తారు?ఎప్పుడిస్తారు? ఇవ్వకపోతే ఎవరికి మొర పెట్టుకోవాలి?