Outdated-Director-VV-Vinayak-Surprising-Entry-as-Hero!దర్శకుడు వీవీ వినాయక్ గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు (ఖైదీ నెంబర్ 150 మినహాయించి). అఖిల్ ని పరిచయం చేస్తూ తీసిన అఖిల్ సినిమా తరువాత ఆయనకు ఇప్పటిదాకా అవకాశం రాలేదు. ఈలోగా ఆయనను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆదివారం ఒక కార్యక్రమానికి హాజరైన వినాయక్ తాను హీరోగా మారడం పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

“ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం నాలుగు కోట్ల మందిలో సీఎం అయ్యే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు’ అని జగన్‌ అన్నారు. ఆ మాటలు నాకు బాగా నచ్చాయి. ఆ మాటలు స్ఫూర్తి నింపడం వల్లే నటుడిగా మారేందుకు జిమ్‌కు వెళ్లడం ప్రారంభించా,” అని వినాయక్ చెప్పుకొచ్చారు. వినాయక్ కుటుంబం ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీ సమర్ధకులు. గతంలో ఆయన తండ్రి వారి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ గా కూడా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం వారు వైఎస్సార్ కాంగ్రెస్ కు మారారు.

అయితే రాజకీయాలకు వినాయక్ ఎప్పుడూ కొంత దూరంగా ఉంటూనే వచ్చారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే రెగ్యులర్ హీరో సినిమాలా కాకుండా ఒక డిఫరెంట్ సబ్జెక్టు అని తెలుస్తుంది. వినాయక్ వయసుకు తగ్గట్టు ఉంటుందని సమాచారం. వినాయక్ బరువు తగ్గే పనిలో ఉన్నారని, చిత్రానికి కావాల్సిన బరువుకు ఆయన వచ్చాకా అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.