Osmania University students BEEF Festivalఉస్మానియా యూనివర్సిటీ రాజకీయాలకు అడ్డాగా మారుతోందా? విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్ధులు వాటిని పక్కనపెట్టి, రాజకీయ పరమైన వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణా ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగి… ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసనలతో హొరెత్తిన ఉస్మానియా, రాష్ట్ర విభజన తర్వాత సర్దుమనిగింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో తమకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. అలా మరికొన్ని రోజులు ఉస్మానియా మగ్గిపోయింది.

ఇక, గత వారం, పది రోజులుగా “బీఫ్ ఫెస్టివల్”తో మరోసారి ఉస్మానియా వార్తల్లో నిలిచింది. రాజకీయ పార్టీల రంగ ప్రవేశంతో ఈ విషయం కాస్త కోర్టు మెట్లెక్కడంతో సిటీ సివిల్‌ కోర్టు, హైకోర్టులు విద్యాలయాల్లో ‘బీఫ్ ఫెస్టివల్’ వంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని తేల్చిచెప్పాయి. యూనివర్సిటీ రిజిస్త్రార్ కూడా అయితే బీఫ్ ఫెస్టివల్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డీసీఎఫ్ ఎలాగైనా ఉస్మానియాలో జరిపి తీరుతామని ప్రకటించడంతో, పోలీసులతో పహారా కాసారు. ఇంత ఉద్రిక్త వాతావరణంలోనూ పెదకూర పండుగను నిర్వహించుకున్న విద్యార్ధి సంఘాలు, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేసి, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా విడుదల చేసారు. ఇది తాము సాధించిన విజయంగా అభివర్ణించుకున్నారు.

నవభారతావనికి నాందిగా నిలవాల్సిన విద్యార్ధులు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చేసే పనులివేనా? విద్యార్ధి దశలో సాధించాల్సిన విజయాలంటే ఇవేనా? కెరీర్ ను పక్కన పెట్టి, ఇలా బీఫ్ ఫెస్టివల్ అంటూ రాజకీయ రంగులు పులుముకుంటూ సమయం వృధా చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఈ సందర్భంగా ఉస్మానియా రిజిస్టార్ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకోవాలి. కోర్టు తీర్పులను గౌరవించాలని, ఎవరైనా అతిక్రమిస్తే ఆయా విద్యార్ధుల అడ్మిషన్స్ రద్దు చేస్తామని ప్రకటించారు. మరి ఇపుడు సోషల్ మీడియాలో కూర తింటూ హల్చల్ చేసిన విద్యార్ధులపై చర్యలు తీసుకుంటే… దానికి ఎవరు బాధ్యులు? ఆ విద్యార్ధుల తల్లితండ్రుల ఆవేదనకు ఏ రాజకీయ నాయకుడు బదులు చెప్తారు?

ఇకనైనా, రాజకీయాలకు దూరంగా ఉంటూ తమ పరిధిలో లేని అంశాలపై దృష్టి మరల్చి, కెరీర్ ను గాడిలో పెట్టుకుంటారని ఆశిద్దాం. దేశ భవిష్యత్తు నిర్ణేతలైన విద్యార్ధి లోకం సరైన మార్గంలో పయనించిన నాడే పురోగతి సాధ్యమవుతుంది. లేకుంటే… “గతమెంతో ఘనం” అంటూ వర్తమానంలో భవిష్యత్తుపై ఆశలు వదులుకుని… గతాన్ని తలుచుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందన్న హెచ్చరికలు విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి.