Oscars_Natu_Natu_Song_RRRప్రపంచం సంగతేమో కానీ టాలీవుడ్ తో పాటు యావత్ దేశం మొత్తం మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న ఆస్కార్ వేడుక కౌంట్ డౌన్ నెలలు రోజుల నుంచి గంటల్లోకి మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంటర్వ్యూలతో అమెరికా మీడియా హోరెత్తిపోతోంది. అభిమానులను కలుసుకోవడం, అక్కడి సెలబ్రిటీలు ఇస్తున్న పార్టీలకు హాజరు కావడం, వీలైనంత పబ్లిక్ ఎక్స్ పోజర్ ఉండేలా చూసుకోవడం అంతా చక్కగా జరుగుతోంది. నాటు నాటుకి వంద శాతం అవార్డు ఖాయమనే నమ్మకం యుఎస్ వర్గాల్లోనూ ఉంది.

ఒకవేళ వస్తే మాత్రం స్టేజి మీద లైవ్ గా ఆ పాటకు డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంటుందని ఇద్దరి అభిమానులు ఎదురు చూశారు. చరణ్ యథాలాపంగా వై నాట్ చేస్తామన్నట్టుగానే సంకేతం ఇచ్చాడు. కానీ తారక్ మాత్రం ప్రాక్టికల్ గా అలోచించి అలా చేసే ఛాన్స్ లేదని, ప్రాక్టీస్ చేయడానికి తగినంత సమయం లేదు కనక కేవలం కీరవాణి, రాహుల్ సిప్లిగుంజ్, కాలభైరవలతో స్టేజి మీద పాడించడం ఉండొచ్చని కుండ బద్దలు కొట్టేశాడు. వాస్తవానికి జరగబోయేది ఇదే. అందుకోసమే సంగీత దర్శకుడు గాయకులకు ఆహ్వానాలు వెళ్లాయి

అసలు ఫ్యాన్స్ అంత పెద్ద వేదిక మీద తమ హీరోలు నృత్యం చేయాలనుకోవడమే అసంబద్ధం. ఎందుకంటే ఒరిజినల్ సాంగ్ షూట్ చేసినప్పుడే పదుల సంఖ్యలో రీటేకులు తీశారు. ఇద్దరి కాళ్ళు లయబద్దంగా ఉండాలనే ఉద్దేశంతో రాజమౌళి వాళ్ళను ఎంతగా సతాయించారో స్వయంగా చెప్పుకున్న అనుభవాలు యుట్యూబ్ లో ఉన్నాయి. సో చూసేందుకు ఈజీగా ఉంటుంది కానీ చేయడం నరకం కన్నా తక్కువేమీ కాదని ఇక్కడి మీడియాతో రామ్ చరణే ఇంతకు ముందు అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

కాబట్టి ఏదో గర్వంగా చెప్పుకోవడం కోసమో లేదా ట్విట్టర్ లో వీడియోలు వైరల్ చేసుకోవడం కోసమో అలా ఆశించడం కరెక్ట్ కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇంటర్నేషనల్ స్టేజి మీద మన హీరోలే నవ్వులపాలవుతారు. కఠినమైన శిక్షణ అవసరమైన ఇలాంటి వాటికి ఎంతలేదన్నా నెల రోజులకు పైగా ట్రైనింగ్ కావాలి. చరణ్ ఏమో శంకర్ షూటింగ్ లో కంటిన్యూగా పాల్గొని యుఎస్ వచ్చాడు. తారక్ చూస్తే కొరటాల శివ సినిమా పనులు, తారకరత్న మరణం ఇలా విపరీతమైన ఒత్తిడిని దాటుకుని చేరుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో నాటు నాటు చేయమనడం సబబు కాదు. అయినా నామినేషన్ వచ్చింది ఒరిజినల్ సాంగ్ కంపోజింగ్ కి కానీ కొరియోగ్రఫీకి కాదు.