Oscars_Natu_Natu_Song_RRR_MM_Keeravaniదశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగు సినిమాలో కొత్త శకం మొదలయ్యింది. సగటు ఇండియా ఫిలిం మేకర్ కి ఎప్పటికప్పుడు కలలా మిగిలిపోయిన ఆస్కార్ పురస్కారాన్ని అంతర్జాతీయ వీధుల్లో ఎంఎం కీరవాణి, చంద్రబోస్ లు సగర్వంగా అందుకున్నారు. ఎన్నో అంచనాలు అనుమానాల మధ్య రాజమౌళి అనుకున్నది సాధించారు. తమ విభాగంలో నామినేషన్ రాకపోయినా జక్కన్న బృందానికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చి అక్కడికి వెళ్లినందుకు తగిన ఫలితం దక్కింది.

ప్రతి మూవీ లవర్ గర్వంగా కాలర్ ఎగరేసేలా అద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యింది. ఈ ఏడాది కూడా కలగా మిగిలిపోతుందేమోననే భయాలన్నీ పోయాయి. సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల, కోదండపాణి, సత్యంలతో మొదలుపెట్టి ఇళయరాజా, చక్రవర్తి, ఏఆర్ రెహమాన్ తమన్ ల కాలం దాకా ఎందరో ఎన్నో ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చారు. జెనరేషన్స్ మర్చిపోలేని పాటలను అందించారు. కానీ అవేవి ఆస్కార్ గడప దాకా వెళ్లలేకపోయాయి. ప్రయత్నం చేశారో లేదో తెలియదు కానీ ఒక మునివర్యుడిగా రాజమౌళి చేసిన తపస్సుకు దేవుళ్ళ దీవెనలు దక్కాయి.

ఈ ఆనంద క్షణం గురించి వర్ణించేందుకు మాటలు లేవు. సెలబ్రిటీలతో మొదలుకుని సామాన్యుల దాకా అందరూ ఇదేదో తమకే వచ్చినంత గర్వంగా భావిస్తున్నారు. అసలు మాస్ కి ఊత పదమైన నాటు నాటుని ఆసలు తెలుగు భాషే రాని విదేశీయుల నోటి వెంట పదే పదే పలికించేలా చేయడం మాములు విషయం కాదు. ఆ ఆస్కార్ స్టేజి ఎక్కడమే గొప్పనుకునే మనస్తత్వం నుంచి అదే వేదిక మీద తెలుగు పాటని ఫారినర్స్ తో డాన్సు చేయించి అదయ్యాక ఆడిటోరియం మొత్తం లేచి నిల్చుని చప్పట్లు కొట్టడం అరుదైన ఆవిష్కరణ

కీరవాణి, చంద్రబోస్ ల పాత్ర ఈ పాట రీచ్ లో ఎంత ఉందో అంతే నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ కు, రోజుల తరబడి విపరీతమైన రీటేకులతో ఒళ్ళు హూనం చేసుకున్న తారక్ చరణ్ లకు అంతే ఉంది. ఒకవేళ స్క్రీన్ మీద ఈ నృత్యం అంతగా పండకపోయినా, స్టెప్పులు ఏ మాత్రం అటుఇటు అయినా ఇవాళ ఈ అద్భుత సందర్భం వచ్చేది కాదు. ఒక్కటి మాత్రం నిజం. ఆస్కార్ గతుకుల మీద మనం నడవలేమని జంకుతున్న భారతీయ దర్శకులకు రాజమౌళి బలమైన సిమెంట్ రోడ్డు వేశాడు. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవడమే మిగిలినవాళ్ళు చేయాల్సింది