Ori Devuda coming to OTT in just 20 Daysముత్తు సినిమా ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద రజినీకాంత్ మహా ధనవంతుడు. ఏనుగు అంబారీల మీద తిరుగుతూ కోట్లాది సంపదతో తులతూగుతూ ఉంటాడు. కట్ చేస్తే వర్తమానంలో ఆయన కొడుకు చిన్న రజనీకాంత్ బంగాళాలో పనివాడిగా ఉంటే తండ్రి మాసిపోయిన గెడ్డంతో చెట్లు పుట్టలు తిరుగుతూ వేదాంతం చెబుతుంటాడు. బాలీవుడ్ పరిస్థితికి ఈ ఉదాహరణ అచ్చంగా సరిపోతుంది. ఎన్నడూ లేని గడ్డుస్థితిని నార్త్ బాక్సాఫీస్ చవి చూస్తోంది. గడిచిన పది నెలల కాలంలో పట్టుమని అయిదు బ్లాక్ బస్టర్లు లేక అలో లక్ష్మణా అంటూ కేకలు పెడుతోంది. ది కాశ్మీర్ ఫైల్స్, బ్రహ్మాస్త్ర, భూల్ భూలయ్యా 2, గంగూబాయి కటియావాడిలను మినహాయిస్తే దాదాపు అన్నీ ఫ్లాపులే.

అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ ఇలా పెద్ద స్టార్లందరికీ షాకులు తగిలాయి. అక్కడి ఆడియన్స్ వీళ్ళ నేలబారు కంటెంట్ కి తూర్పు తిరిగి దండం పెట్టేశారు. ఫలితంగా ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, కాంతార, కార్తికేయ 2 లాంటి సౌత్ మూవీస్ బ్రహ్మరథం దక్కించుకున్నాయి. ఒకప్పుడు సల్మాన్ షారుఖ్ లాంటి స్టార్ల సినిమాలు వస్తున్నాయంటే హైదరాబాద్ లోనే కాదు చిన్న జిల్లా కేంద్రాల్లో కూడా చాలా సందడి ఉండేది. మైనే ప్యార్ కియా, హం ఆప్కే కౌన్, లగాన్, గదర్ లాంటివి తెలుగు రాష్ట్రాల్లోనూ వంద రోజులు సిల్వర్ జూబ్లీలు ఆడిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఏది వచ్చినా మార్నింగ్ షో సగం నిండినా అదో గొప్ప ఘనతగా భావించాలి.

అర్బన్ ఉచ్చులో పడి పదే పదే హై క్లాస్ సొసైటీల చుట్టే కథలు రాసుకుంటున్న అక్కడి దర్శక నిర్మాతలు మాస్ ని పూర్తిగా విస్మరించడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. పుష్ప 1 తెలుగు కంటే హిందీలోనే అంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం ఇదే. ఉత్తరాది రచయితలు మూలాలు మర్చిపోతున్నారు. కరణ్ అర్జున్ లాంటి కమర్షియల్ ఫ్లేవర్స్ ని, దిల్ తో పాగల్ హై లాంటి యూత్ ఫుల్ జానర్స్ ని పక్కనపెట్టేసి ఏం తీస్తున్నారో వాళ్ళకే అంతుచిక్కని రీమేకుల వలయంలో అవుట్ డేటెడ్ అవుట్ ఫుట్ ఇస్తున్నారు. దీనివల్లే దక్షిణాదిలో బాగా ఆడిన గద్దలకొండ గణేష్, జెర్సీ, హెలెన్, విక్రమ్ వేదా లాంటి వాటికి కనీస ఆదరణ దక్కక ఫెయిల్యూర్ అనిపించుకున్నాయి.

మనకు ఇప్పుడేం ఇబ్బంది లేదు. కానీ అక్కడిలా జరగకూడదంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎంతో కొంత పాజిటివ్ టాక్ వచ్చిన గాడ్ ఫాదర్ చివరికి లాస్ వెంచర్ అయ్యింది. పర్లేదు చూసేయచ్చన్న ఊర్వశివో రాక్షసివో ఫైనల్ గా యావరేజ్ అయినా గొప్పే. హంగామా చేసిన ఓరి దేవుడా ఇరవై రోజులకే ఓటిటిలో వేస్తున్నారు. ఇవన్నీ రీమేకులే. సెట్ల మీద బుట్టబొమ్మ లాంటి బడ్జెట్ సినిమాతో మొదలుపెట్టి భోళాశంకర్ లాంటి మెగామూవీ దాకా అన్నీ పునఃనిర్మితాలే. ముందు వీటి మీద మోజు తగ్గించుకోవాలి. ఒరిజినల్ క్రియేటివిటీకి భాషతో సంబంధం లేకుండా ఏ స్థాయిలో పట్టం కడతారో అర్థమయ్యిందిగా. లేదూ ఇదే మూసలో తమిళ మళయాలంవి అరువు తెచ్చుకుంటూనే ఉంటామంటే మాత్రం ఏం జరుగుతుందో వేరే చెప్పాలా.