Orange Movie Re-Releaseకాలంతో సంబంధం లేకుండా ఫ్లాప్ సినిమా ఎపుడైనా ఫ్లాప్ గానే పరిగణిస్తారు. ఓ పది ఇరవై ఏళ్ళ తర్వాత సోషల్ మీడియాలో తెగ మోసేసి దాన్ని క్లాసిక్ అన్నంత మాత్రాన బాలేని చిత్రం హఠాత్తుగా మంచిదైపోదు. జనసేన నిధుల సమీకరణ కోసం ఈ నెల చివరి వారంలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆరంజ్ ని రీ రిలీజ్ చేయబోతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ట్రైలర్ కట్ చేయించి సోషల్ మీడియాలో ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. నాగబాబు ప్రత్యేకంగా అభిమానులకు పిలుపునిచ్చి అందరూ సినిమా చూస్తే పార్టీకి ఫండ్స్ వస్తాయని చెబుతూ స్పెషల్ వీడియో బైట్ ఇచ్చారు.

అంతా బాగానే ఉంది కానీ గతంలో అఫీషియల్ గా ప్రకటించిన ఇండస్ట్రీ హిట్ మగధీరని కాదని ఇప్పుడీ ఫ్లాప్ మూవీని ఎందుకు తేవాల్సి వచ్చిందనే అనుమానం ఫ్యాన్స్ లో లేకపోలేదు. అయితే కమర్షియల్ లెక్కల్లో నిక్కచ్చిగా ఉండే అల్లు అరవింద్ దానికొచ్చే రెవిన్యూని రాజకీయ అవసరాలకు ఇవ్వడం ఇష్టం లేదనే సంకేతం ఇవ్వడం వల్లే హఠాత్తుగా ఆరంజ్ ని తెచ్చారనే కామెంట్ ఉంది. జల్సా కూడా గీతా ఆర్ట్స్ దే. దాని రీ రిలీజ్ టైంలో అది పోకిరి రికార్డులను బద్దలు కొట్టి ఏకంగా మూడు కోట్లకు పైగా వసూలు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. థియేటర్లు హౌస్ ఫుల్స్ తో కళకళలాడాయి. కానీ జల్సా ఒరిజినల్ టైంలో ఎలా ఆడినా అందులో మంచి వినోదం ఉంది.

దాని వల్ల జనసేనకు డొనేషనే కోటి దాకా వెళ్ళింది. ఈ లెక్కన అసలే ఆర్ఆర్ఆర్ ఊపులో ఉన్న అభిమానులు మగధీరను కూడా ఎగబడి చూస్తే అంతకన్నా ఎక్కువ మొత్తం నష్టం వస్తుందని గుర్తించిన అరవింద్ చాలా ప్లాన్డ్ గా సాంకేతిక కారణాలు సాకుగా చూపించారనే టాక్ ఉంది. లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టు ఇందులో నిజానిజాలు వాళ్ళకే తెలుసు కానీ ఒకప్పుడు ఇదే ఆరంజ్ నష్టాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పిన నాగబాబు ఇప్పుడు తిరిగి అదే సినిమాని థియేటర్లలో మళ్ళీ చూడమని పిలుపునివ్వడం ట్విస్టు.

హరీష్ జైరాజ్ అద్భుతమైన పాటలు, చరణ్ డాన్స్ లాంటి కొన్ని సానుకూలాంశాలు ఆరంజ్ లో ఉన్నాయి. కానీ వాటిని మించి జెనీలియా ఓవరాక్షన్, భరించలేని నసతో కూడిన ఫారిన్ ఎపిసోడ్ ఇవన్నీ అప్పట్లో ఫ్యాన్స్ నే భయపెట్టాయి. ఇప్పుడు కూడా ఆన్ లైన్ లో ఫార్వార్డ్ చేసుకుంటూ రిపీట్ లో సాంగ్స్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు కానీ అదే పనిగా రెండున్నర గంటలు కూర్చుని ఆస్వాదించే సీన్ అందులో లేదు. సరే కారణాలు ఎవరైనా డిజాస్టర్లను ట్రెండ్ పేరుతో మళ్ళీ రుద్దే ట్రెండ్ ఆ మధ్య రెబెల్ ఇప్పుడు ఆరంజ్ త్వరలో ఆంధ్రావాలా క్రమంగా దీన్ని ఫ్యాన్స్ ఎమోషన్ కి కనెక్ట్ చేసి కాసులు కురిపించే కామధేనువుగా మార్చేశారు.