KCR fires GHMC employeesతెలంగాణా రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు గురువారంనాడు మూడు దెబ్బలు తగిలాయి. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ లకు కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి కె.అజయ్‌కుమార్ నోటీసులు జారీ చేసి, 48 గంటలలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌ను విలీనం చేసి గోదావరి జిల్లాల తరహాలో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ తమ పార్టీలో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడాన్ని ఈసీ తప్పుపట్టింది. అలాగే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సచివాలయంలోని తన చాంబర్‌లో ఇతర పార్టీల నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లుగా ఈసీ పేర్కొంది.

కేసీఆర్, కేటీఆర్ ల పరిస్థితి ఇలా ఉంటే, అధికార పార్టీకి చెందిన పటాన్‌ చెరువు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి సంగారెడ్డి అదనపు మేజిస్ట్రేట్ కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్షతో పాటు 2,500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. పటాన్‌ చెరువు పరిధిలోని పాశ మైలారంలోని ఓ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రమేష్ అనే వ్యక్తి చనిపోగా, ఈ ఘటనలో పరిశ్రమ యజమాని లక్ష రూపాయల పరిహారం ఇవ్వగా, ఎమ్మెల్యే మహిపాల్ అనుచరులు సదరు పరిశ్రమ యజమాని నుండి 15 లక్షల రూపాయల చెక్కును బలవంతంగా రాయించుకున్నారని కేసు నమోదైంది. అయితే ఈ కేసులో వచ్చిన తీర్పును పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువిస్తూ బెయిల్ ను కూడా మంజూరు చేయడం అధికార పార్టీ వర్గీయులకు ఊరట కలిగించే అంశం.