opposition did not understand KCR Staminaరాజకీయంగా కేసీఆర్ ప్రస్తుతం ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ప్రతిపక్షాలను అణగద్రొక్కుతూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న కేసీఆర్ కు మరోవైపు ప్రజలు కూడా ఘనవిజయాలతో బ్రహ్మరధం పడుతున్నారు. ఎవరూ ఒప్పుకున్నా, లేకున్నా… ప్రస్తుతానికి తెలంగాణాలో కేసీఆర్ దే రాజ్యం అనే విధంగా పాలన కొనసాగుతోంది. అయితే అంతటి శక్తిగా ఎదిగిన కేసీఆర్ ను ప్రతిపక్షాలు చాలా తేలికగా తీసిపారేయడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం.

తెలంగాణా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష పార్టీలు టిడిపి, కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డాయి. “తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు బడ్జెట్ లను మాత్రమే కేసీఆర్ ప్రవేశపెడుతుందని, ఆపై టీఆర్ఎస్ పార్టీ మాయమవుతుందని” తెలుగుదేశం పార్టీ నేత, టీ టీడీపీ శాసనసభా నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. గడచిన రెండేళ్లలో అభూత కల్పనలతో కూడిన బడ్జెట్ ప్రతిపాదనలను టీఆర్ఎస్ సభ ముందు ఉంచిందని, రైతులకు ఇచ్చిన హామీలేవీ సక్రమంగా అమలు కావడం లేదని, కేసీఆర్ సర్కారును నామరూపాల్లేకుండా చేసే రోజు త్వరలోనే రానుందని, దళితులు, గిరిజనులకు భద్రత కొరవడిందని, ఏ సంక్షేమ పథకమూ సక్రమంగా జరగడం లేదని” తనదైన స్థాయిలో తీవ్ర స్వరం వినిపించారు రేవంత్ రెడ్డి.

ఇక, టీ-కాంగ్రెస్ సీనియర్ నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2017 వరకు తామంతా విశ్రాంతిలో ఉంటామని చెప్పిన కోమటిరెడ్డి, 2018లో తిరిగి కార్యక్షేత్రంలోకి దిగుతామని, 2019లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలో ఏకంగా 95 స్థానాలను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుందని కాస్త జ్యోతిష్కులు చెప్పే భవిష్యత్తును తెలంగాణా ప్రజల ముందుంచారు. వచ్చే ఎన్నికల దాకా తమ జిల్లాకు చెందిన జగదీశ్ రెడ్డి మంత్రిగానే ఉం,, నల్లగొండ జిల్లాలోని మొత్తం 15 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే పడతాయని విమర్శల వర్షం కురిపించారు.

అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ వున్న తీరుకు, వీరు చేస్తున్న విమర్శలకు పొంతన లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు. రాజకీయ విమర్శలు సహజమే అయినా, అవి ఎప్పుడూ నిజానికి దూరంగా ఉండకూడదు అనేది విశ్లేషకుల వాదన. ఒక వైపు అసలు ప్రతిపక్షమే లేకుండా చేస్తున్న కేసీఆర్ రాజకీయ సిద్ధాంతం ప్రతిపక్షాలకు ఇంకా అర్ధం కాలేదా అంటూ విశ్లేషణలు వస్తున్నాయి. 2019లో టీఆర్ఎస్ గెలుస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం గానీ, ప్రస్తుతం ఆ పార్టీ ఉన్న బలానికి ఈ వ్యాఖ్యలు సరికావన్నది గమనించాలని కోరుతున్నారు.