Nagarjuna Karthi Oopiriనేటితరం సినిమా అంటే హీరో, హీరోయిన్, విలన్, ఫైట్లు, పాటలు, పంచ్ డైలాగ్స్, బూతు సెటైర్లు… ఇవన్నీ సమపాళ్ళల్లో లేవంటే… ఈ సినిమా ఏంటిరా బాబూ… ఇలా ఉంది… వాళ్ళ పైత్యం మన మీద రుద్దుతున్నారేంటి అని సగటు ప్రేక్షకుడు మొహమాటం లేకుండా చెప్పే రోజులివి. నిజానికి “ఊపిరి” సినిమాకు కూడా ఇదే టాక్ వినపడింది. ‘ఈ సినిమా ఏంటి… ఇలా ఉంది… సగటు కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేకపోయినా… అద్భుతంగా ఉంది…’ అంటూ వెలువడిన టాక్ ఒక ‘ట్రెండ్ సెట్టింగ్’ సినిమాను అందించిన అనుభూతిని చిత్ర యూనిట్ కు మిగిల్చింది.

బహుశా పాత సినిమాలలో ఉండే… కధ, పాత్రలు, సహజ సిద్ధమైన డైలాగ్స్, సందర్భానుసారమైన సాహిత్యంతో కూడిన పాటలతో కూడిన చిత్రాలను ప్రస్తుత తరం దర్శకులు కూడా కధాబలమైన సినిమాలు తీయగలమని నిరూపించుకునే ప్రయత్నం చేసారో ఏమో గానీ… “ఊపిరి” సినిమాకు విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమాలో ప్రస్తుత తరం సినిమాలలో చూపిస్తున్నట్లు హీరోలు లేరు… హీరోయిన్లు లేరు… అలాగే ప్రతినాయకులు లేరు… అంతకు మించి పంచ్ డైలాగ్స్, డబుల్ మీనింగ్ భావాలు, స్కిన్ షో… ఇలాంటివేమీ లేవు… ఉన్నదల్లా పరిమితమైన పాత్రలు… వారి చుట్టూ అల్లుకున్న కధ.

“ఊపిరి” అనే సినిమా రీమేక్ అన్న విషయాన్ని మరచిపోతే… ఈ సినిమాపై మరింత గౌరవం, ఇష్టం పెరుగుతుందేమో…! నిజానికి ఇలాంటి సినిమాలను రీమేక్ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు ‘ఊపిరి’ సినిమా యూనిట్ మొత్తాన్ని అభినందించాలి. రీమేక్ ల పేరుతో చాలా సినిమాలను తెలుగులో రీమేక్ చేసారు, చేస్తున్నారు కూడా..! అయితే సహజంగా కమర్షియల్ సినిమాల రీమేక్ లకు ఇచ్చిన ప్రాముఖ్యత కధాబలం ఉన్న సినిమాలకు నిర్మాతలు గానీ, దర్శకులు గానీ ఇవ్వరు., అలాగే ప్రేక్షకులు కూడా ఇచ్చేవారు కాదు. కానీ, ‘ఊపిరి’ సినిమాతో ఇలాంటి మాటలకు ఆస్కారం లేకుండా చేసింది.

ఈ విషయంలో ముందుగా దర్శకుడు వంశీ పైడిపల్లిని మెచ్చుకోకుండా ఉండలేం. హాలీవుడ్ వాతావరణం నుండి తెలుగుకు అనుగుణంగా కధను మార్చుకున్న తీరు అద్భుతం. అలాగే ఇలాంటి కధలు విని, ధైర్యంతో నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాత పొట్లూరి వరప్రసాద్ గట్స్ ని కూడా ప్రశంసించి తీరాలి. ఇక, చిత్రంలోని ప్రధాన నటవర్గం నాగార్జున, కార్తిల స్థానంలో మరొకరిని ఊహించుకోలేనంతగా నటించారు. సినిమా కమర్షియల్ గా విజయం సాధించాలంటే మసాలా సినిమాలే కాదు, సరిగ్గా ప్రేక్షకుడికి అందించగలిగితే… ఒక ‘మనం,’ మరో ‘ఊపిరి’ కూడా అవుతుందని తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంటున్నారు. ఇక దృష్టి సారించాల్సింది సినీ రచయితలు, దర్శకులు, నిర్మాతలు మాత్రమే..!