TDP-MLA-Revanth-Reddyతెలంగాణా గడ్డ మీద తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోందన్న వార్త పార్టీ వర్గాలకు, కార్యకర్తలకు మనోవేదనను మిగులుస్తోంది. గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 12 మంది అధికార టీఆర్ఎస్ లోకి చేరిపోగా, సండ్ర వెంకట రమణ సైతం అదే దారిలో ఉన్నారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ సైతం టీఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.

నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా… ఇటీవల సిఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులతో రమణ చర్చలు జరిపారని, ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండదు అనే భావనకు వచ్చిన రమణ టీఆర్ఎస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే ముహూర్తం నిర్ణయించుకుని కేసీఆర్ చెంత వాలిపోవడానికి సిద్ధమవుతున్నట్లుగా మీడియా వర్గాల వేదికగా సాగుతున్న ప్రచారం. దీనిపై ఇప్పటివరకు రమణ స్పందించకపోవడంతో ‘మౌనం అంగీకారం’ అన్న రీతిలో టిడిపి ఖాళీ అవుతున్నట్లుగా కనపడుతోంది.

సండ్ర, రమణలు కూడా వీడిపోతే చంద్రబాబు కోసం మిగిలిన నాయకుడిగా “ఒకే ఒక్కడు” రేవంత్ రెడ్డి మిగలనున్నారు. ఇటీవల రేవంత్ కూడా కాంగ్రెస్ లోకి వెళ్లిపోతారని ప్రచారం జరిగినప్పటికీ, దీనిని రేవంత్ ఖండించి, స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేసారు. దీంతో ఎట్టి పరిస్థితులలోనూ రేవంత్ రెడ్డి తెలుగుదేశంను వీడరన్న నమ్మకం పార్టీ వర్గాలలో ఏర్పడింది. నిజానికి టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా మారింది కూడా ఒకే ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే!

ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, టిడిపిలలో కేసీఆర్ పై భీకర స్వరం వినిపించింది ‘ఒకే ఒక్కడు’ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకరువు పెట్టినందుకు దక్కిన ప్రతిఫలమే ‘ఓటుకు నోటు’ కేసు అన్న టాక్ కూడా పొలిటికల్ వర్గాల్లో ఉన్న విషయం తెలిసిందే. అలాంటి సమయంలోనే రేవంత్ రెడ్డి కోసం కూడా టీఆర్ఎస్ చాలా రకాలుగా చాలా ప్రయత్నాలు చేసిందన్న విషయం గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అలాంటి కష్ట పరిస్థితులలోనే పార్టీ మారలేదంటే, తెలంగాణాలో చంద్రబాబు కోసం నిలబడే ఒకే ఒక నాయకుడిగా రేవంత్ రెడ్డి నిలుస్తారన్న విశ్వాసం సర్వత్రా వ్యక్తమవుతోంది.