One more TSRTC employee diedతెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరి ఇంకొక ప్రాణాన్ని బలిగొంది. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడగా… ఈరోజు ఇంకో ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా షేక్‌ ఖాజామియా పని చేస్తున్నారు. ఈరోజు తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందాడు.

గత 15 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో ఆయన పాల్గొన్నారని, తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే ఆవేదనతో ఆయన చనిపోయారని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఖాజామియా మృతిపట్ల తెలంగాణ ఏపీ ఆర్టీసీ ఐకాస నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వ మొండి వైఖరిని వారంతా ఖండిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా నిన్న తలపెట్టిన తెలంగాణ బంద్ సఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ తదుపరి కార్యాచరణ ప్రకటించింది. రేపు అనగా సోమవారం నాడు అన్ని డిపోల ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగుతామని ప్రకటించారు. 22న ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టవద్దని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు విన్నవిస్తారు.

అదే విధంగా 23న అన్ని పార్టీల నేతలను కలుస్తారు 24న మహిళా కండక్టర్లతో నిరసన ప్రదర్శన చేపడుతామని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మీడియాకు వెల్లడించారు. మరో వైపు రెండు సార్లు హై కోర్టు ఆదేశించినా కార్మికులతో చర్చలు చేపట్టడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీనిపై హై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.