One-More-Barrage-Below-Prakasam-Barrage-vijayawadaరాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు నీటి కష్టాలు తప్పవన్న సంకేతాలు తొలి ఏడాదిలోనే కనిపించాయి. అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోలవరం పూర్తయితే కొంత కష్టాలు తగ్గే అవకాశం ఉంది గానీ, పూర్తి స్థాయిలో అయితే కాదనే చెప్పాలి. ఏపీకి జీవనాడిలా గోదావరి, కృష్ణా నదులు ఉండగా, గోదావరిపై పోలవరం నిర్మాణంలో ఉండగా, పట్టిసీమ ఇప్పటికే పూర్తయ్యి ప్రజలకు ఫలాలను అందిస్తోంది. దీంతో పట్టిసీమ విషయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఫుల్ క్రెడిట్ దక్కింది. అలాగే పోలవరాన్ని కూడా వచ్చే ఎన్నికల లోపున పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇక, కృష్ణానది విషయానికి వస్తే, పులిచింతల ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. నాగార్జున సాగర్ డ్యాం దాటిన తర్వాత నీటిని నిల్వ చేసే ప్రాజెక్ట్ గా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ ఒక్కటే ఉండగా, పులిచింతల ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి మరికొంత సమయం పడుతుంది. అయితే ప్రకాశం బ్యారేజ్ ను కృష్ణమ్మ దాటితే, అంతిమంగా సముద్రుడులోకి అంతర్భాగం కానుంది. అయితే ఈ మధ్యలో ఒక డ్యాం నిర్మాణం కొరకు చంద్రబాబు సర్కార్ సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసారన్న వార్త అత్యంత ప్రాధాన్యతను దక్కించుకుంది.

“ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ దిగువన మరో భారీ ఆనకట్టను నిర్మించాలని, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలయ్యే నీరు మరెక్కడా ఆగకుండా సముద్రంలోకి వెళ్లిపోతున్నదని, దిగువన ఆనకట్ట కడితే, నీటిని నిలిపి కరవు ప్రాంతాల్లో వాడుకోవచ్చని, డెల్టా దిగువన ఉన్న రైతులకు ఆ బ్యారేజ్ నుంచి నీటిని ఇవ్వడం ద్వారా, పై నున్న నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని” కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి తెలుపుతూ చంద్రబాబు లేఖ రాశారు.

ప్రకాశం బ్యారేజికి దిగువన 12 కిలోమీటర్ల దూరంలో ఒకటిన్నర కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి అనుకూలంగా ఉందని, మూడు నుంచి మూడున్నర మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహాన్ని నియంత్రించేలా దీన్ని నిర్మిస్తామని, బ్యారేజ్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీలో ఉందని, దాదాపు 1.7 టీఎంసీల నీటిని ఇక్కడ నిలుపుకోవచ్చని, మత్స్య సంపదను పెంచుకోవచ్చని ఈ లేఖలో చంద్రబాబు స్పష్టంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రతిపాదనలపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర జల వనరుల శాఖ నుంచి కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఆదేశాలు అందాయి.

ఈ బ్యారేజ్ కొత్తగా ప్రతిపాదించినది కనుక బోర్డుతో పాటు అత్యున్నత నిర్ణయాక మండలిలో సైతం చర్చ జరగాల్సి వుందని, అప్పుడే ప్రాజెక్టుకు అనుమతులు లభిస్తాయని జల వనరుల రంగం నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఒకవేళ అనుమతులు ఇస్తే, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించవచ్చా? లేక రాష్ట్ర ప్రాజెక్టుగానే భావించాలా? అన్న విషయంపై యాజమాన్య బోర్డు, జల వనరుల శాఖ నిర్ణయమే తుది నిర్ణయమని తెలిపారు. ఇక ఏపీ ప్రతిపాదనలపై తెలంగాణ అభిప్రాయాన్ని కూడా బోర్డు కోరే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే, అభ్యంతరాలేంటన్న విషయమై తెలంగాణను వివరణ కోరవచ్చని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ కు అనుమతులు లభించి వచ్చే ఎన్నికల లోపున పని ప్రారంభమైతే ఎన్నికలలో చంద్రబాబుకు తిరుగుండదన్న భావన సామాన్య ప్రజల్లో సైతం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు అనుబంధంగా ఈ ప్రాంతంలో కృష్ణానది ఉండడంతో ఖచ్చితంగా ప్రజలకు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోతుందని భావిస్తున్నారు. అంతేగాక ప్రకాశం బ్యారేజ్ నుండి ఉంచిన 12 కిలోమీటర్ల నీటి నిల్వను ఆంధ్రప్రదేశ్ టూరిజంకు కూడా వినియోగించుకునే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.

ఇదంతా సాకారం అయితే మరోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినట్లుగానే భావించవచ్చు. ఇప్పటికే పట్టిసీమతో గోదావరి తీరవాసులను చంద్రబాబు సంతృప్తి పరచగా, తాజాగా కృష్ణానదీ పరివాహక ప్రాంతం కూడా కవర్ అయితే రాష్ట్రంలోని ప్రధాన జిల్లాల ప్రజల మద్దతు చంద్రబాబు వైపుకే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దిగువకు వెళ్ళిపోయే నీరు కావడంతో, ఇతర రాష్ట్రాలు కూడా అభ్యంతరాలు చెప్పడానికి అవకాశం ఉండదని నిపుణులు అభిప్రాయ పడుతున్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలు మాత్రం చంద్రబాబు ప్రతిపాదనలకు భంగం కొట్టే అవకాశం ఉందని సమాచారం.