Rajamouli Does Not Repeat Allu Arjun's Mistakeసంక్రాంతి, దసరా పండగలు అని గానీ, సమ్మర్ సెలవులు అని గానీ సీజన్ చూసి తన సినిమాలను రిలీజ్ చేయడం రాజమౌళికి అస్సలు తెలియదు. ఓ విధంగా చెప్పాలంటే అన్ సీజన్లోనే అద్భుతమైన రికార్డులను కొల్లగొట్టిన ట్రాక్ జక్కన్న సొంతం. అలాంటి రాజమౌళి తన సహజశైలికి విరుద్ధంగా “ఆర్ఆర్ఆర్” కోసం అన్ని లెక్కలు వేసుకుని, తొలుత దసరా రిలీజ్ అనుకున్నారు.

కరోనా కారణాలతో ఆ తర్వాత సంక్రాంతి సీజన్ అయితే కలిసి వస్తుందని ఫిక్స్ అయ్యి, గత నెల రోజులుగా పబ్లిసిటీని తారాస్థాయికి తీసుకువెళ్లారు. ఇప్పుడు తెలుగునాట కంటే ఎక్కువగా ఇతర రాష్ట్రాల సినీ ప్రేక్షకలోకం “ఆర్ఆర్ఆర్” కోసం నిరీక్షించే విధంగా పబ్లిసిటీ చేసుకొచ్చారు. ఇప్పటికీ ఇంకా ఇతర రాష్ట్రాల ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు జక్కన్న.

ఎప్పుడైతే రొటీన్ కు భిన్నంగా రాజమౌళి ఫెస్టివల్ హాలిడేస్ ను ఎంచుకున్నారో, అప్పటినుండే “ఆర్ఆర్ఆర్”కు రిలీజ్ అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా ఢిల్లీ మరియు ముంబైలలో నెలకొన్న పరిస్థితుల రీత్యా బాలీవుడ్ సినిమాలే వాయిదా వేసుకుంటున్నారు. మరి వందల కోట్ల మార్కెట్ ను కొల్లగొడదామని భావించిన “ఆర్ఆర్ఆర్” పరిస్థితి ఏంటి?

తలచుకుంటేనే అగమ్యగోచరంగా మారిపోతుంది. మునుపెన్నడూ లేనంత ప్రెషర్ లో రాజమౌళి ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. సాధారణంగా సినిమా హిట్ అవుతుందా? లేదా? అన్న ఆందోళనలో ఆయా చిత్ర యూనిట్స్ ఉంటాయి. కానీ రాజమౌళికి మాత్రం సినిమా రిలీజ్ విషయంలో చివరి నిముషంలో ఓమిక్రాన్ రూపంలో ఇస్తోన్న ట్విస్ట్ తాను ఊహించింది కాదు.

ఢిల్లీ, ముంబై వంటి నగరాలే కాదు దక్షిణాదిలో కర్ణాటకలో కూడా ఇప్పటికే రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు. తమిళనాడులో మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా పరిస్థితి భిన్నంగా ఉన్నప్పటికీ, ఏపీలో టికెట్ ధరల అంశం, షోల నియంత్రణ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం అనేది రాజమౌళికి ఏ మాత్రం ఉపశమనం కలిగించేది కాదు.

ఇండియాలో పరిస్థితి ఇలా ఉంటే యుఎస్ లో కూడా ఓమిక్రాన్ తీవ్రరూపం దాలుస్తోంది. అయినప్పటికీ “ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఇప్పటికే 2 మిలియన్స్ డాలర్స్ చేరువ కావడం అనేది, ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ను సూచిస్తోంది. ఇంకా రిలీజ్ డేట్ కు వారం రోజుల సమయం ఉన్న నేపధ్యంలో పరిస్థితులు ఎలా మారతాయో అన్న ఆసక్తి సర్వత్రా ఉంది.

ఢిల్లీ మరియు ముంబయి బాటలో మరికొన్ని రాష్ట్రాలు గనుక పయనిస్తే, “ఆర్ఆర్ఆర్” కలలు కన్న కలెక్షన్స్ దరి చేరడం కష్టమే! ఈ నేపథ్యంలో లాస్ట్ మినిట్ లో వాయిదా పడితే, ఇప్పటివరకు చేసిన ప్రమోషన్స్ అంతా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి మిగిలిపోతాయి. అలాగే ఎప్పుడు తగ్గుతుందో తెలియని ఓమిక్రాన్ అంతం కోసం మళ్ళీ ఎన్నాళ్ళు వేచిచూడాలో!?

ఇన్నేళ్ల రాజమౌళి సక్సెస్ ఫుల్ కెరీర్ లో “ఆర్ఆర్ఆర్” పెడుతోన్న పరీక్షలు బహుశా తన మొదటి సినిమాకు కూడా పడి ఉండరు. విశేషం ఏమిటంటే… ఓమిక్రాన్ రూపంలో ఉన్న కరోనా మరియు జగన్ సర్కార్ నిర్ణయాలు మినహా దేశంలో ఇతర సినిమాల నిర్మాతలు & ప్రభుత్వాలు కూడా “ఆర్ఆర్ఆర్”కు సహకరిస్తూ స్వాగతం పలికారు. అయినప్పటికీ “ఆర్ఆర్ఆర్” రిలీజ్ కు ముందు రాజమౌళిని టెన్షన్ పెడుతోంది.