Om Namo Venkatesaya Teaser ‘అన్నమయ్య, శ్రీరామదాసు’ వంటి అద్భుతమైన సినిమాలను బ్యాక్ గ్రౌండ్ లో పెట్టుకున్న ‘రాఘవేంద్రరావు – నాగార్జున – కీరవాణి’ కాంభినేషన్ లో రాబోతున్న తాజా చిత్రం “ఓం నమో వేంకటేశాయ” ఫస్ట్ టీజర్ ను కింగ్ నాగార్జున విడుదల చేసారు. వరుసగా వినూత్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటున్న ‘కింగ్’ నాగార్జున, మరోసారి భక్తిరస చిత్రంలో మైమరిపించడం ఖాయం అనుకున్న ప్రేక్షకులకు కాసింత నిరుత్సాహపరిచే విధంగా ఫస్ట్ టీజర్ ఉండడం విశేషం.

మొదటగా చెప్పాలంటే… రియాలిటీతో కూడిన గ్రాఫిక్స్ ను మాత్రమే ఇష్టపడుతున్న ప్రేక్షకులకు ఈ టీజర్ లో చూపించిన గ్రాఫిక్స్ అంతగా రుచించవు. లేటెస్ట్ గా అప్ డేట్ అవుతోన్న రేంజ్ లో కాకుండా, ఇంకా పాత కాలం నాటి గ్రాఫిక్స్ నే దర్శకేంద్రుడు వినియోగిస్తున్నట్లుగా టీజర్ లో దృశ్యాలు కనపడుతున్నాయి. అలాగే నాగార్జున ఆలపించిన స్వరం అస్సలు సూట్ కాలేదు, వినపడిన ఒకటి, రెండు డైలాగ్స్ కూడా భక్తిరసమైనవి కాకుండా, ఏదో కమర్షియల్ సినిమాల మాదిరి ఉండడం విశేషం.

కానీ, నాగ్ మాత్రం తనలోని సత్తాను మరోసారి చూపించే విధంగా కనపడుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ‘సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి’ వంటి డిఫరెంట్ చిత్రాలలో కనిపించిన ‘కింగ్,’ ఫ్రెష్ లుక్ తో ముందుకు వస్తుండడం ప్రధాన ప్లస్ పాయింట్. అలాగే సినిమాలోని ఇతర ప్రధాన పాత్రలైన మోహన్ బాబు, అనుష్క, ప్రజ్ఞాజైస్వాల్ లుక్స్ ను కూడా ఈ టీజర్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ‘ఓం నమో వేంకటేశాయ’ అనే చాంటింగ్ కీరవాణి మార్క్ ఏమోషనల్ సంగీతాన్ని రుచిచూపించింది.