nagarjuna-om-namo-venkatesaya-release-dateదర్శకుడిగా రాఘవేంద్రరావుకంటూ ప్రత్యేకంగా ఎందుకు అభిమానులుంటారనే సినీ విజ్ఞులకు తెలిసిందే. ‘అన్నమయ్య’ వంటి భక్తిరసమైన చిత్రంలోనూ రక్తిని ప్రదర్శించిన ఘనుడు రాఘవేంద్రుడు. అలాంటి రాఘవేంద్రరావు తాజాగా మరోసారి ‘కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో “ఓం నమోవేంకటేశాయ” సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీ తాజాగా బయటకు వచ్చింది.

సంక్రాంతి పండగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణల పోటీ తర్వాత ఫిబ్రవరిలో ‘వేంకటేశుడి’ హంగామాకు ముహూర్తాన్ని ఖరారు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10వ తేదీన భారీ స్థాయిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా అధికారికంగా వెలువడిన సమాచారం. దీంతో పాటు విడుదల చేసిన ఓ రెండు స్టిల్స్ కూడా రాఘవేంద్రరావు మార్క్ టాలెంట్ ను చూపిస్తున్నాయనేది అసలు టాక్.

‘కంచె’ ఫేం ప్రజ్ఞా జైస్వాల్ తో నాగార్జున ఉన్న ఫోటో… ఈ సినిమాలో భక్తికే కాదు, రక్తికి కూడా లోటు లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్తోంది. గతంలో ప్రజ్ఞాపై చిత్రీకరించిన పాటపై హాట్ హాట్ గా చర్చలు జరగగా, తాజాగా విడుదల చేసిన స్టిల్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లయ్యింది. మరి ఈ రాజకుమారిని వెండితెరపై రాఘవేంద్రుడు ఏ పళ్ళ తోటలో కూర్చోబెడతాడో చూడాలన్న కూతుహలం సినీ అభిమానుల్లో నెలకొనడం సహజమే.