Old woman shocked with YS jagan speechవైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన “ప్రజా సంకల్ప” పాదయాత్రలో రెండో రోజు జగన్ ఇచ్చిన హామీకి ఓ వృద్ధురాలు షాక్‌కు గురికాగా, అక్కడున్న ప్రజలు అయోమయానికి లోనయ్యారు. మంగళవారం జగన్ పాదయాత్ర వేంపల్లి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు మాట్లాడుతూ… తనకు ఎవరూ లేరని, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నానని, తనను ఆదుకోవాలని జగన్‌ను కోరింది.

అవ్వ ఆవేదనకు స్పందించిన జగన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎవరూ లేని అనాథలు, వృద్ధులు స్వచ్ఛందంగా ఎక్కడైనా ఉండాలనుకునే వారిని తాను అధికారంలోకి వస్తే ఆదుకుంటానని అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ మండల కేంద్రంలో వృద్ధాశ్రమాలు కట్టిస్తానని హామీ ఇచ్చారు. అందులో వైద్యులు, నర్సులు కూడా ఉండేలా చూస్తానని చెప్పుకొచ్చారు.

అయితే ఇందుకోసం ఒక ఏడాది ఓపిక పట్టాలని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కట్టడానికి మరో ఏడాదిన్నర సమయం కావాలని, ఆ తర్వాత సెటిల్ చేస్తానని చెప్పడంతో అక్కడున్న వారు, ముఖ్యంగా సాయం అడిగిన వృద్ధురాలు షాక్‌కు గురైంది. మొత్తంగా రెండున్నరేళ్లు వేచి చూడమన్న జగన్‌వైపు వింతగా చూసింది. జగన్ మాటలను విన్నవారు కూడా అయోమయానికి గురయ్యారు. జగన్ చెప్పిన సమయం వరకు ఆమె బతికి ఉంటుందా? అని సెటైర్లు వేసుకోవడం కనిపించింది.