official Pawan Kalyan alliance with bjpబీజేపీ, జనసేన కీలక సమావేశం పూర్తయింది. బీజేపీ తరపున ఇన్‌చార్జ్‌ సునీల్‌ దియోధర్, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన తరపున సమావేశంలో పాల్గొన్న వారిలో పవన్‌కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ తదితరులు ఉన్నారు. సమావేశం అనంతరం మీడియాతో సంయుక్త ప్రెస్ మీట్ పెట్టారు.

రాష్ట్రంలో సామాజిక న్యాయం బీజేపీ- జనసేనతోనే సాధ్యమని, ఇరువురం కలిసి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని స్పష్టం చేశారు. 2024 అధికారమే లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్రంలో పాలెగాళ్ల రాజ్యం నడుస్తుందని, ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

తమ పొత్తును ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన ప్రధాన మంత్రి మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు పవన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలోనే కాకుండా.. దేశంలో ఎక్కడ అవసరం ఉందో.. అక్కడ కలిసి పని చేస్తామన్నారు. తమ మధ్య ఓ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని.. ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై చర్చించుకుంటామని ఈ సందర్భంగా పవన్ చెప్పుకొచ్చారు.

“నాకు మోడీజి అంటే చాలా ఇష్టం. ఆయన దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే 2019 ఎన్నికలకు ముందు విడిపోవాల్సి వచ్చింది. కుటుంబ, అవినీతి, నిరంకుశ పాలనను ప్రక్షాళన చేసే విధంగా మా పొత్తు పని చేస్తుంది. 2024లో జనసేన – బీజేపీల ప్రభుత్వం ఏర్పడటం ఖాయం,” అని పవన్ చెప్పుకొచ్చారు.