Obstacles Statred to  Avanti srinivasa raoఏపీ పర్యటక., సాంస్కృతిక శాఖా మంత్రి అవంతి శ్రీనివాసరావుకు భీమిలి నియోజకవర్గంలో అసమ్మతి సెగలు తగిలాయి. టీడీపీ పార్టీ నుండి ఎన్నికల ముందు వైసీపీ పార్టీలోకి వలస వచ్చి పదవులు పొందిన పెద్దలలో అవంతి ఒకరు. వైసీపీ స్థాపించిన నాటి నుండి ఉన్న నాయకులను కాదని జగన్ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తనపై తీవ్ర విమర్శలు చేసిన అవంతికి ఎమ్మెల్యే స్థానం కేటాయించినప్పటికీ జగన్ మీద ఉన్న గౌరవంతో అవంతి విజయానికి సాయిశక్తుల కృషిచేశారు ఆ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు.

ముందు నుండి వైసీపీ పార్టీ జెండా మోసిన నేతలను సైతం పక్కన పెట్టి మరి ఆఖరి నిముషంలో టీడీపీ పార్టీ నుండి వచ్చి వైసీపీ కండువా కప్పుకున్న నేతలే ఇప్పుడు జగన్ గారికి దగ్గరయ్యారని.., అటువంటి నాయకులకే పార్టీలో ప్రాధాన్యం దక్కుతుందని సగటు వైసీపీ కార్యకర్తల మనోవేదన. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హర్నిశలు శ్రమించి పార్టీ బలోపేతానికి కృషి చేసిన సామాన్య కార్యకర్తలకు పార్టీ అన్యాయం చేస్తుందని వారు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.

అవంతి ముఖ్య అనుచరుడిగా ఉన్న చంద్రరావుతో పాటు ఇంకా కొంత మంది ముఖ్య అనుచరులను పక్కన పెట్టడంతో వారంతా అవంతి తీరు పై గుర్రుగా ఉన్నారు. పార్టీ మీద ఉన్న గౌరవంతో ఇప్పటిదాకా నోరు మెదపలేదని ఇక ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వైసీపీ క్యాడర్ అవంతికి గట్టి హెచ్చరికలు పంపుతుంది.

అవంతి పార్టీలు మారడంలో సిద్దహస్తుడని.., ఆయనకు ఆయనే సాటి అని వైసీపీ సామాన్య కార్యకర్త కూడా అభిప్రాయపడుతున్నాడు. ఒకప్పుడు జగన్ తీరును తీవ్రంగా విమర్శించి ఇప్పుడు అదే పార్టీలో కీలక నేతగా ఉన్నారు … ఇప్పుడు ప్రతిపక్షపార్టీ అధ్యక్షుడు అయిన చంద్రబాబును విమర్శిస్తున్నారు. కానీ ఎన్నికల నాటికి మళ్ళి ఏ పార్టీ కండువా కప్పుకుంటారో తెలియదని అని చురకలు వేస్తున్నారు అవంతి వ్యతిరేక వర్గం.

అవంతి చర్యల ఫలితంగా ప్రస్తుతం నియోజక వర్గంలో క్రియాశీలకంగా ఉండే ముఖ్య కార్యకర్తల సంఖ్య అనూహ్యంగా తగ్గుతుందని ఆ విషయాన్ని పార్టీ అధిష్టానం గమనించి నిర్ణయాలు తీసుకోవాలని.. పార్టీ ముఖ్య అనుచరులు పార్టీ పెద్దలకు బహిరంగంగానే విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది పక్క పార్టీల వైపు చూస్తున్నారని స్థానికకంగా ప్రచారం జరుగుతుంది. పార్టీ పాతాళానికి వెళ్లకముందే పార్టీ పెద్దలు మేల్కొని సరైన నిర్ణయాలు తీసుకోవాలని లేకపోతే పార్టీ క్యాడర్ మొత్తం చేజారిపోతుందని పార్టీ మద్దతుదారులు కోరుకుంటున్నారు.

అసలు కొసమెరుపేంటి అంటే టీడీపీ పార్టీ నుండి వచ్చి.., టీడీపీ ని విమర్శిస్తూ.., టీడీపీ నుండి వచ్చిన వారికే.., అవంతి పెద్ద పీట వేయడం. ఇది కదా రాజకీయమంటే అని మధ్యలో నలిగిపోతున్న సగటు కార్యకర్త యొక్క ఆవేదన.