O panneerselvam Tamil Nadu RK Nagar Politicsతమిళనాడులో గత రెండు రోజుల నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలు, తాజాగా పన్నీరు సెల్వం వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు తెరతీశాయి. ఈ నేపథ్యంలో జయలలిత మరణానంత పరిణామాలను తమిళనాడు వాసులు మరోసారి జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. జయలలిత మరణానంతరం నమ్మిన బంటుగా ఉన్న పన్నీరు సెల్వం చిన్నమ్మ (శశికళ) కు మద్దతు ప్రకటించి, అమ్మ దగ్గర ఉన్నట్టే చిన్నమ్మ దగ్గర కూడా ఉన్నారు. అమ్మకు మొక్కినట్టే చిన్నమ్మకు కూడా వంగి వంగి సలాం చేశారు. దీంతో తన పదవికి ఎలాంటి ప్రమాదం రాదని భావించారు.

అయితే ఆయన ఊహించని విధంగా శశికళ నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. తన చుట్టూ పన్నీరు సెల్వం లాంటి అమ్మ విధేయులు ఉండకూడదని భావించారు. పార్టీ, పదవి తన గుప్పిట్లోనే ఉండాలని భావించారు. దీంతో పన్నీరు సెల్వంతో పాటు, అంతవరకు ఆమెకు విధేయత చూపిన కొంత మందిలో అమ్మ స్నేహితురాలిగా ఉంటూ, ఆమె స్థానాన్ని కబలించే ప్రయత్నం చేస్తున్న శశికళలోని అధికార కాంక్షను గుర్తించారు. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, సమావేశం నుంచి నేరుగా అమ్మ సమాధి వద్దకు చేరుకుని మౌన దీక్షతో తిరుగుబాటును శశికళకు రుచి చూపించి మొదటి షాక్ ఇచ్చాడు పన్నీర్.

అనంతరం జైలు శిక్ష పడడంతో శశికళకు ఊహించినదే అయినా రెండో షాక్ తగిలింది. అయినప్పటికీ దిగి రాని శశికళ… జయలలిత వెళ్లగొట్టిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడమే కాకుండా, వారికే పార్టీ పెత్తనాన్ని కూడా అప్పగించారు. అంతే కాకుండా పన్నీరు సెల్వం నమ్మక ద్రోహి అని, పదవి కోసం పాకులాడే వ్యక్తి అని పార్టీ నేతలతో ప్రచారం కూడా చేయించారు. అలాగే పన్నీరుపై పెద్ద ఎత్తున విమర్శలు… శాపనార్థాలు… చివరికి స్వయంగా శశికళ జైలు కెళ్తూ జయలలిత సమాధి సాక్షిగా శపథం చేసిన సంగతి తెలిసిందే.

అలా కాలగర్భంలో… జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ ఉప ఎన్నికలు సమీపించడంతో… అన్నాడీఎంకే (శశికళ వర్గం) డబ్బులు వెదజల్లితే… అన్నాడీఎంకే (పన్నీరు సెల్వం వర్గం) అమ్మ పేరుతో ప్రచారం నిర్వహించారు. దీనికి తోడు వీరికి వచ్చే ఓట్లపై జయలలిత మేనకోడలు దీప కూడా ఆధారపడింది. దీంతో డీఎంకే లబ్దిపొందుతుందని, విజయం కూడా ఆ పార్టీదేనని అంచనాలు కూడా వెలువడ్డాయి. ఈ సమయంలో విజయం ఎలాగైనా దక్కించుకోవాలని భావించిన శశికళ వర్గం డబ్బులు పంచడంలో మరింత ఉత్సాహం చూపింది.

ఇదే ఆ పార్టీ అభ్యర్థి టీ-టీవీ దినకరన్ కొంప ముంచడంతో, అరెస్టు అనివార్యమైంది. దీంతో పన్నీరు సెల్వం వర్గంతో చర్చలకు పళనిస్వామి వర్గం ముందడుగు వేసింది. అంతా పూర్తైన అనంతరం పన్నీరు సెల్వం నోరు విప్పారు. పార్టీకి తనను దూరం చేసిన సమయంలో తనను శశికళ ఏ రకమైన విమర్శలు చేస్తూ నోరు పారేసుకున్నారో… సరిగ్గా పన్నీరు సెల్వం కూడా అవే విమర్శలు చేశారు. తనను ఏఏ మాటలు అన్నారో పన్నీరు సెల్వం కూడా అచ్చం అవే పదాలను మక్కికి మక్కీగా వాడి శశికళకు షాక్ ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం పన్నీరు సెల్వం తమిళనాడు ప్రజల్లో హీరోగా మారారు.