Jr Ntr కారణాలు ఏవైతేనేం విపరీతంగా ఆలస్యమవుతూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 30 ఎట్టకేలకు మొదలుకాబోతోంది. మార్చి 23 ఓపెనింగ్ ని అధికారికంగా ప్రకటించారు. సంతోషం. ఇంకో వారంలో ఆర్ఆర్ఆర్ మొదటి వార్షికోత్సవం వస్తోంది. ఏడాదికి పైగా గ్యాప్ కేవలం స్క్రిప్ట్ ని లాక్ చేయడం కోసమే అంటే చిన్న విషయం కాదు. కొరటాల శివకు కావాల్సినంత సమయం తారక్ ఇచ్చాడు. జనతా గ్యారేజ్ లాంటిది కాదు దానికి పదిరెట్లు ఎక్కువ క్వాలిటీ ఉన్న కంటెంట్ ఇస్తే తప్ప ఇంత సుదీర్ఘ నిరీక్షణకు, ప్యాన్ ఇండియా ట్యాగ్ కు న్యాయం జరగదు.

పైకి ఇదంత తేలికగా కనపడుతోంది కానీ ఈ సినిమా విడుదలయ్యే 2024 ఏప్రిల్ 5 వరకు ఎన్నో సవాళ్లు ఎదురుకోవాల్సి ఉంటుంది. ఆస్కార్ తర్వాత తనకు రామ్ చరణ్ కు ఇమేజ్ పరంగా ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద ఛాలెంజ్. పైగా సోషల్ మీడియాలో ట్రిపులార్ గురించి అందులో హీరోలకు ఇచ్చిన పాత్రల ప్రాధాన్యం గురించి అర్థం పర్థం లేని పోలికలు ట్రోల్స్ వల్ల నానా రచ్చ రిలీజైన రోజు నుంచి ఆస్కార్ వేడుక దాకా జరుగుతూనే ఉంది. వాటికి బలమైన సమాధానం చెప్పాలంటే రిజల్ట్ తో కొట్టాలి తప్పించి స్టేట్మెంట్లతో ఇంటర్వ్యూలతో కాదు.

అందుకే తారక్ వీలైనంత మౌనాన్నే ఆశ్రయిస్తున్నాడు. అమిగోస్, దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో బలవంతపు పరిస్థితుల్లో తప్ప బయట ఎక్కడా తన కొత్త సినిమా గురించి మాట్లాడ్డం లేదు. స్క్రిప్ట్ ఎలా వస్తోంది లైన్ ఏంటి ఏ బ్యాక్ డ్రాప్ ఉంటుంది ఇలాంటి వివరాలు ఏ కొంచెం బయటికి రాకుండా జాగ్రత్తపడుతున్నాడు. పోస్టర్లలో చూపిస్తున్న సముద్రాన్ని చూసి ఎవరికి వారు పోర్టు స్మగ్లింగ్ మాఫియా అంటూ ఏవేవో ఊహించుకుని ప్రచారం చేయడం తప్పించి అసలు మ్యాటర్ హీరో దర్శకుడు యూనిట్ తప్ప ఇంకెవరికీ తెలియదన్నది వాస్తవం.

మరోవైపు రాజకీయంగా ఏదో ఒక ఇష్యూలో తారక్ తీసుకొచ్చి హైలైట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్యాన్స్ సైతం కొన్నిసార్లు అత్యుత్సాహానికి వెళ్లి బయట ఎయిర్ పోర్ట్ లో ఇతర హీరోల వేడుకల్లో సీఎం సీఎం అంటూ అరవడం అర్థం లేని వ్యవహారం. అసలా ఆలోచనే లేనప్పుడు ఇలా చేయడం నెగిటివే. ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఎన్టీఆర్ 30తో ఇవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. సరిగ్గా గురి కుదిరిందా ఇండియా వైడ్ కాదు గ్లోబల్ గానూ ఆ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లొచ్చు. అది కొరటాల శివ చేతుల్లో జూనియర్ ఎన్టీఆర్ భుజాల మీద ఉంది. ఆ బరువెంతుందో తెలుసు కాబట్టే కిందపడకుండా మోసేందుకే ఎక్కువ సమయం తీసుకున్నారు.