NTR Mahanayakudu weak promotionsనందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఈనెల 22న చిత్రం విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం సంక్రాంతికి విడుదలయ్యి ఘోరమైన పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ఎక్కడా కూడా బ్యాడ్ టాక్ గానీ బ్యాడ్ రివ్యూలు గానీ రాలేదు. అయినా సినిమా ఆడలేదు. అది ఎందుకో విశ్లేషకులకు కూడా అంతు పట్టలేదు. ఇప్పుడు మహానాయకుడు ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులతో పాటు ట్రేడ్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

మొదటి భాగంలో నష్టపోయిన వారికి బాలయ్య తోడ్పాటు నిచ్చాడు. అయితే మరో మూడు రోజులలో సినిమా విడుదల ఉండగా పేలవమైన పబ్లిసిటీ సినిమాను దెబ్బ తీస్తుంది. చాలా మందికి సినిమా విడుదల అవుతున్నట్టు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. విడుదలకు ముందు అనంతపురంలో ఒక ఫంక్షన్ చెయ్యాలని ముందుగా అనుకున్నారు. ఇప్పుడు మాత్రం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు తెలుస్తుంది. విడుదలకు తరువాత ఎక్కువ పబ్లిసిటీ చెయ్యాలని అనుకుంటున్నారట.

ఎన్టీఆర్ మహానాయకుడులో అత్యంత కాంట్రవర్సియల్ అయినట్టు వంటి ఎన్టీఆర్ చివరి రోజులను పూర్తిగా పక్కన పెట్టేశారు. నాదెండ్ల భాస్కర రావు ఎన్టీఆర్ అమెరికాలో ఉన్న సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చెయ్యడం, ఆ తరువాత ఆయనను నిలువరించి ఎన్టీఆర్ ను తిరిగి అధికారంలోకి తీసుకుని రావడంతో కథ ముగుస్తుంది. ఈ కథ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం గుర్తు చేసుకుంటున్నట్టుగా మొదటి భాగంలో చూపించారు కాబట్టి ఆమె శివైక్యం కావడంతో కథ పూర్తి అవుతుంది.

ఎన్టీఆర్ – లక్ష్మి పార్వతి, చివరి రోజులు అన్నీ ఆవిడ లేని సమయంలో జరిగాయి కాబట్టి వాటి జోలికి వెళ్లారు. అయితే సినిమాలో తనను నెగటివ్ గా చూపిస్తే కోర్టుకు వెళ్తా అని ఇప్పటికే నాదెండ్ల భాస్కరరావు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన తన లాయర్లతో నిర్మాతలకు నోటీసులు పంపినట్టు మీడియాతో చెప్పారు. దీనితో ఈ సినిమాను వివాదాలు అంత తేలికగా వదలవు అని అర్ధం అవుతుంది. ఎన్నికల ముంగిట విడుదల అవుతున్న ఈ సినిమా రాజకీయంగా కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.