కొరటాల శివ దర్శకత్వంలో మోహన్ లాల్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “జనతా గ్యారేజ్” విడుదలై, ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలను తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే తొలి రోజు మంచి వసూళ్లు సాధించిందన్న సమాచారంతో చిత్ర యూనిట్ పార్టీ చేసుకుంది. తన కెరీర్ లోనే ఓ ‘క్లాసిక్’ మూవీగా ‘జనతా గ్యారేజ్’ ను అభివర్ణించిన కొరటాల శివతో కలిసి చిత్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ పార్టీలో భాగస్వామి కావడం విశేషం. టాక్ పరంగా ఎలా ఉన్నా, కలెక్షన్స్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ళ దిశగా దూసుకుపోతుండడంతో, అంతకు ముందు తారక్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ రికార్డులను దాటుతుందని అంచనా వేస్తున్నారు. జూనియర్ కెరీర్ లో తొలి 50 కోట్ల సినిమాగా ‘నాన్నకు ప్రేమతో’ నమోదు కాగా, ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ ఆ సినిమాను దాటుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.
రాబోయే రెండు రోజులు కూడా ఆదివారం, వినాయకచవితి సెలవు దినాలు కావడంతో… దాదాపుగా తొలి వారాంతానికి 40-50 కోట్ల మధ్య వసూళ్లు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఆ తర్వాత ఎంతవరకు ‘జనతా గ్యారేజ్’ కొల్లగొడుతుంది, ఆల్ టైం జాబితాలో ఏ స్థానంలో ఉంటుంది అన్న విషయం తెలియాలంటే మరో రెండు వారాలు గడవాల్సిందే.