Janatha Garage, Janatha Garage Failure, Janatha Garage Failure Reasons, Janatha Garage Flop Reasons, Ntr Janatha Garage Failure Reasons, Jr NTR Janatha Garage Failure Reasons‘పక్కా బ్లాక్ బస్టర్ రాసుకోండి…’ అంటూ దర్శకుడు కొరటాల శివ చెప్పిన మాటలు… బహుశా తారక్ అభిమానుల చెవుల్లో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. గత రెండు సినిమాలను సైలెంట్ గా విడుదల చేసి ‘బ్లాక్ బస్టర్’లు అందుకున్న దర్శకుడు కొరటాలే స్వయంగా ప్రకటన చేయడంతో… ‘జనతా గ్యారేజ్’పై అభిమానుల్లో నమ్మకంతో పాటు భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే ఆ భారీ ఎక్స్ పెక్టేషన్స్ ‘జనతా గ్యారేజ్’పై మిక్స్ డ్ టాక్ కు కారణమయ్యాయి.

మూడవ సినిమాకు దర్శకత్వం వహించిన కొరటాలపై అంత నమ్మకం పెట్టుకునేలా చేసింది మాత్రం ‘శ్రీమంతుడు’ సినిమా. కొరటాల దర్శకత్వం వహించిన ‘మిర్చి’ ఎలాంటి హంగామా లేకుండా విడుదలై భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఇక, రెండవ సినిమా విషయానికి వచ్చేపాటికి… సాధారణంగా మహేష్ సినిమాకుండే క్రేజ్ తప్ప… ఆల్ టైం రికార్డులను అందుకుంటుందన్న అంచనాలైతే ఖచ్చితంగా లేవు. కానీ, ఊహించని తీర్పును ప్రేక్షకులు అందించి, ‘శ్రీమంతుడు’ సినిమాను ఏకంగా నెంబర్ 2 స్పాట్ లో కూర్చోబెట్టారు. దీనికి ప్రధాన కారణం కూడా ఎలాంటి అంచనాలు లేకుండా ‘శ్రీమంతుడు’ విడుదల కావడమే!

దీనికి తోడు ‘శ్రీమంతుడు’ కధను డీల్ చేయడంలో కొరటాల నూటికి 200 మార్కులు పొందారు. ‘మిర్చి’ కధ ఒక రొటీన్ తెలుగు సినిమా కధ. కానీ, ‘శ్రీమంతుడు’ కాస్త రిస్క్ తో కూడుకున్న కధ. ఇదే టాలీవుడ్ లో కొరటాలకు ఒక ‘బ్రాండ్’ ఏర్పడేలా చేసింది. అదే ‘బ్రాండ్’తో ‘జనతా గ్యారేజ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగింది. దానికి తగినట్లుగానే టీజర్, ట్రైలర్ అన్ని వరుసగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ‘శ్రీమంతుడు’ బాటలోనే ‘జనతా గ్యారేజ్’ కూడా నడుస్తుందని అంచనాలు మొదలయ్యాయి. కానీ, ‘జనతా గ్యారేజ్’ కధను కొరటాల సరిగ్గా డీల్ చేయలేకపోయారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘శ్రీమంతుడు’ సినిమాలో తప్పులు వెతకడానికి అన్వేషించిన సినీ విమర్శకులకు ‘జనతా గ్యారేజ్’ నిండా లాజిక్ లేని సన్నివేశాలే తారసపడ్డాయి.

అలా ‘శ్రీమంతుడు’ సినిమాను బ్యాక్ గ్రౌండ్ లో పెట్టుకుని వెళ్ళిన వారికి ‘జనతా గ్యారేజ్’ నిరాశ పరచడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా ఏళ్ళ కాలం నాటి ఓ మూస కధను కొత్త హంగులతో చూపించాలన్న తాపత్రయమే ఎక్కువగా కనపడింది. కానీ, ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళిన వారిని ‘జనతా గ్యారేజ్’ మరీ అంతగా నీరుగార్చకపోవచ్చు. ఈ సినిమాలో కొరటాల మార్క్ మాటలు, టేకింగ్ అయితే కనపడ్డాయి గానీ, కధనం విషయంలో కొరటాల మార్క్ ‘ట్రీట్మెంట్’ కనిపించకపోవడం నిరాశ కలిగించే అంశం. అలా ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ విజయం ‘జనతా గ్యారేజ్’కు మైనస్ గా మారింది. అయితే ఇక్కడ ప్రేక్షకులు దృష్టిలో పెట్టుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే… ప్రతి సినిమాను ‘శ్రీమంతుడు’ మాదిరి తెరకెక్కించడం అసాధ్యం.

చివరగా… ఈ సినిమాలో మోహన్ లాల్ కనపరిచిన నటన అమోఘం. కేవలం హావభావాల ద్వారానే డైలాగ్స్ పండించిన తీరు అద్వితీయం. మోహన్ లాల్ ఒప్పుకోవాలే గానీ, ఈ సినిమా తర్వాత మరింత మంది తెలుగు దర్శక నిర్మాతలు ఈ లెజెండరీ నటుడి వెంట పడడం ఖాయం. ఇదే సమయంలో జూనియర్ కూడా ఏమి తక్కువ కాదు. ముఖ్యంగా సెకండాఫ్ లో తారక్ నటన పతాక స్థాయికి చేరుకుంది. అయితే తెలుగు తెరపై మోహన్ లాల్ నటన చాలా ఫ్రెష్ నెస్ ను తీసుకువచ్చింది. అదే “జనతా గ్యారేజ్”కు ఉన్న అసలు హైలైట్.