NTR Health University name change What about students certificatesఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఇంతవరకు అధికార, ప్రతిపక్షాల రాజకీయ వాదనలు మాత్రమే అందరూ వినారు. అయితే తొలిసారిగా ఆ యూనివర్సిటీలో వైద్యవిద్యను అభ్యసించిన డాక్టర్ ఉప్పలపాటి రఘురాం ఈ సమస్యలో మరో కోణాన్ని సోషల్ మీడియాలో అందరితో షేర్ చేసుకొన్నారు.

“యూనివర్సిటీ పేరు మార్పు రాజకీయకోణంలోనే ఆలోచిస్తున్నారు తప్ప దానిలో చదువుకొనే విద్యార్థులు ఎదుర్కొబోయే పరిస్థితులను, సర్టిఫికేట్లలో గందరగొలన్నీ ప్రభుత్వం పట్టించుకొన్నట్లు లేదని డాక్టర్ ఉప్పలపాటి రఘురాం అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ఆ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ‘ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ’ పేరుతో సర్టిఫికేట్ జారీ చేశారని, కానీ ఇప్పుడు ఆ పేరు మార్చడంతో తన వద్ద ఉన్న సర్టిఫికేట్‌కి విలువలేకుండా పోయిందని అన్నారు.

మళ్ళీ తాను ఫీజు చెల్లించి కొత్త సర్టిఫికేట్ తీసుకొంటే దానిపై ఇప్పుడు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో వస్తుందని, రేపు రాష్ట్రంలో ప్రభుత్వం మారి మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తే అప్పుడు మళ్ళీ యూనివర్సిటీ పేరుమారుస్తామని చెపుతున్నారు కనుక అప్పుడు మళ్ళీ మరో సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలసివస్తుందని అన్నారు. అలాగే యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికేట్లు అత్యంత విలువైనవని, వాటి పేర్లు, వాటిపై నాయకుల బొమ్మలు మాటిమాటికి మార్చుకొంటూ పోతే ఇక తమ సర్టిఫికేట్లను ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.

ఇటువంటి చాలా ముఖ్యమైన అంశాలను డాక్టర్ ఉప్పలపాటి రఘురాం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నించారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్పింగ్ చూసినట్లయితే పేరు మార్పుతో ఆ యూనివర్సిటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సమస్య ఎంత తీవ్రమైనదో అర్దం చేసుకోవచ్చు.

అలాగే డాక్టర్ ఉప్పలపాటి రఘురాం రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని చక్కటి సలహాలు కూడా ఇచ్చారు. కానీ యావత్ రాష్ట్ర భవిష్యత్‌ని నిర్దేశించే అమరావతి, పోలవరం ప్రాజెక్టులపైనే మూడు ముక్కలాటలు ఆడుతున్న వైసీపీ ప్రభుత్వం, ఈ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థులు, వారి భవిష్యత్‌, వారి సర్టిఫికేట్ల గురించి ఆలోచిస్తుందా?