ntr fans pls cool downఅభిమానాన్ని లెక్కించడానికి కొలమానం లేదు. ఎవరికి తగ్గ రీతిలో వారు తమ తమ ప్రేమాభిమానాలను ప్రదర్శిస్తుంటారు. కానీ “ఆర్ఆర్ఆర్” హంగామా మొదలైన నాటి నుండి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తోన్న సందడి హాట్ టాపిక్ గా మారింది.

ముందుగా ‘జూనియర్ ఎన్టీఆర్ సీఎం సీఎం’ అంటూ పెద్ద నినాదాలు చేసి నాలుక కరచుకున్న వైనం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ రోజున ఫ్యాన్స్ భారీ స్థాయిలో ‘సీఎం సీఎం’ అని కేకలు వేయడం సినీ, రాజకీయాల హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ఇదంతా అభిమానులు చూపుతున్న అత్యుత్సాహం అని తెలిసినప్పటికీ, ఆ అభిమానం హద్దులు దాటుతున్న వైనం చర్చనీయాంశమైంది. సినిమా రిలీజ్ వరకు కూడా తారక్ ఫ్యాన్స్ డామినేషన్ పూర్తిగా కనిపించింది.

మల్టీస్టారర్ సినిమాగా రూపుదిద్దుకున్న “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎలా అయితే లీడ్ చేసారో, ఆఫ్ లైన్ లో ఆయన ఫ్యాన్స్ కూడా అదే రీతిలో సందడి చేసారు. అయితే ఇదంతా సినిమా రిలీజ్ అయ్యేటంత వరకే. ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ హంగామా మొదలైంది.

సినిమాలో రామ్ చరణ్ కు ఇచ్చిన ఎలివేషన్స్ జూనియర్ ఎన్టీఆర్ కు లేవని ఫ్యాన్స్ కలత చెందడంతో మొదలైన నిరాశ అలాగే కొనసాగుతోంది. ఆఫ్ లైన్ లో ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో ఇదో పెద్ద రచ్చగా మారడంతో, స్వయంగా విజయేంద్ర ప్రసాద్ ఈ అంశంపై స్పందించారు.

“ఆర్ఆర్ఆర్” సినిమాకు ముందు, తర్వాత తన కెరీర్ ఉండబోతోందని ఎన్టీఆర్ ప్రకటన ఇచ్చి, ప్రస్తుతం సక్సెస్ ను పూర్తిగా ఆనందిస్తుంటే, వీళ్ళకెందుకండి ఏడుపు, నాకర్ధం కావట్లేదు అని విజయేంద్ర ప్రసాద్ చాలా కూల్ గా చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ అభినయానికి తగిన రోల్ దక్కి, జాతీయ స్థాయి ఉత్తమ నటుడిగా ఎంపిక అయ్యేటంత కీర్తి ప్రతిష్టతలు మూటకట్టుకుంటే, మరో పక్కన ఫ్యాన్స్ ఏమో హీరోయిజం కోసం తాపత్రయ పడుతున్నారు. “ఫ్యాన్స్ కు ఏమోషన్స్ తప్ప లాజిక్స్ ఉండవని” త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఈ సందర్భంగా మరోసారి నిరూపణ అవుతోంది.

విజయేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్థాయిలో హల్చల్ చేస్తోంది. వీటిని షేర్ చేసుకోవడంలో రామ్ చరణ్ అభిమానులు ఇప్పుడు దూకుడు చూపిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కు ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా కొనసాగగా, రిలీజ్ అయిన నాటి నుండి చెర్రీ ఫ్యాన్స్ హవా నడుస్తోంది.