NTR-Canteen-Andhra-Pradeshఎన్నికల ప్రచారంలో భాగంగా నాడు చేసిన ఒక్కో హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు పరుస్తూ వస్తున్నారు. తాజాగా ప్రతిష్టాత్మక ‘అన్న క్యాంటీన్ల’ను ఏర్పాటు చేసే దిశగా చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తమిళనాడులో ‘అమ్మ క్యాంటీన్లు’ తరహాలో ఏర్పాటు చేయనున్న ఈ ‘అన్న క్యాంటీన్ల’ను అమరావతి పరిధిలోని మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని మంత్రులతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

నవ్యాంధ్ర రాజధాని ఏరియాలోని వెలగపూడి, తుళ్లూరు, నవులూరు ప్రాంతాల్లో తొలుత ‘అన్న క్యాంటీన్లు’ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని మంత్రులు పరిటాల సునీత, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ క్యాంటీన్లలో 1 రూపాయికే ఇడ్లీ, 3 రూపాయలకే పెరుగన్నం, 5 రూపాయలకే పులిహోరాను అందజేయాలని నిర్ణయించామని తెలిపారు. అలాగే, అన్న క్యాంటీన్లలో రోజుకు 500 మందికి అల్పాహారం, భోజనం అందించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రులు చెప్పుకొచ్చారు.

ఎలాంటి ఆలస్యానికి ఆస్కారం ఇవ్వకుండా, సత్వరమే ఏర్పాటు చేయాలని సూచించిన ముఖ్యమంత్రి, ధరల పట్టిక, మెనూ గురించి కూడా చర్చించారు. దశల వారిగా రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించినట్లుగా మంత్రులు చెప్పుకొచ్చారు.