NTR Biopic release dateనందమూరి అభిమానులతో పాటు యావత్తు తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) బయోపిక్ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు, నాడు ఎన్టీఆర్ ద్వారా రాజకీయ జీవితం అందుకున్న పొలిటికల్ లీడర్స్ నడుమ ప్రారంభమైన ఈ సినిమాపై అందరి కళ్ళు ఉన్నాయి. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ కనిపించనుండగా, దాదాపుగా 64 గెటప్స్ లలో బాలయ్య కనిపించబోతున్నారన్న వార్త అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది.

ఇంత గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సినిమాను ఈ దసరా నాటికి విడుదల చేయాలని ముహూర్తాన్ని ఖరారు చేసారు. ఈ రిలీజ్ డేట్ విషయంలో ఉన్న ఆసక్తికరమైన అంశం తెలియనిది కాదు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపధ్యంలో… అందుకు ముందుగానే ఈ సినిమా రావడం,పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి ప్రచారంగా ఉపయోగపడనుంది. టిడిపి వ్యవస్థాపకుడిగా ఎన్టీఆర్ జీవితంలోని మధురమైన ఘట్టాలతో కూడుకున్న ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ చేయగలిగితే పర్లేదు గానీ, లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.

ఎలక్షన్ కమీషన్ నిబంధనల ప్రకారం… ఓటర్లను ప్రభావితం చేసే ఏ అంశం కూడా ఎన్నికల సమయాలలో ఉండరాదు. అది సినిమా అయినప్పటికీ! గతంలో ఎన్నో సినిమాల విషయంలో ఈ రకమైన నిబంధనలు విధించారు. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ – మే నెలలో జరుగుతున్నాయన్న సమాచారం ఉంది గనుక, ఈ దసరా సమయానికి విడుదల చేయగలిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. అలా కాకుండా రిలీజ్ విషయంలో జాప్యం జరిగితే, అనుకున్న కార్యాన్ని “ఎన్టీఆర్ బయోపిక్” అందుకోలేకపోవచ్చు.

అయితే గత కొన్నేళ్లుగా బాలయ్య, తేజలు చేస్తోన్న సినిమాలు అనుకున్న సమయానికే షూటింగ్ లు పూర్తి చేసుకోవడం, చెప్పిన సమయానికి విడుదల చేయడం అనేది ఈ సందేహాలను నివృత్తి చేసే అంశం. ఈ సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారన్నది ఒక ఘట్టం అయితే, రిలీజ్ అనేది చిత్ర యూనిట్ ముందున్న అతి పెద్ద సవాల్ గా పరిగణించవచ్చు. ఎన్టీఆర్ ఎదిగిన తర్వాత ఉద్యోగం చేసిన నాటి నుండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఈ బయోపిక్ విశేషాలు ఉంటాయని తెలుస్తోంది.