NTR Biopicనందమూరి బాలకృష్ణ సంక్రాంతి సినిమా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ రేపు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సి ఉంది. అయితే ఈరోజు సెన్సార్ బోర్డు ఆ సినిమా నిర్మాతలకు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే సినిమాలో ఇప్పటికీ బ్రతికి ఉన్న పాత్రల నుండి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని వారి నుండి ఎన్ఓసీ తీసుకురావాలని చెప్పారట. దీనితో చిత్ర నిర్మాతలు చివరి నిముషంలో హైరానా పడుతున్నారని సమాచారం.

ఎన్టీఆర్ కథానాయకుడులో పెద్దగా వివాదాలు ఉండే అవకాశం లేకపోవడంతో ఎన్ఓసీ తెచ్చుకోవడంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే ఇంత తక్కువ టైం లో వారి అందరి నుండీ ఎన్ఓసీలు తీసుకురావాలంటే ఇబ్బందే. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు నిర్మాతలు ఈ ఇబ్బంది నుండి ఎలాగోలా బయటపడతారు. కాకపోతే దీనితో రామ్ గోపాల్ వర్మకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సెన్సార్ బోర్డు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కూడా ఇదే విధంగా ఎన్ఓసీ ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.

అదే గనుక జరిగితే రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు దగ్గర నుండీ, నందమూరి కుటుంబ సభ్యుల నుండీ ఎన్ఓసీ తేవడం అనేది దాదాపుగా అసంభవం అనే చెప్పుకోవాలి. లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు పాట చూస్తే ఎందుకు అనేది అర్ధం అయిపోతుంది. దీనితో అసలు రామ్ గోపాల్ వర్మ సినిమా అసలు రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. అదే సమయంలో ఎన్టీఆర్ రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు కూడా ఇటువంటి ఇబ్బందులకు గురి కావొచ్చు ఈ రూల్ వల్ల.