Depressing-News-For-Nandamuri-Balakrishna-Fans“మహానటి”గా సావిత్రి జీవిత చరిత్ర సిల్వర్ స్క్రీన్ పై తళతళ మెరిసిపోతోంది. ప్రధాన పాత్ర పోషించిన కీర్తి సురేష్ కు అవార్డుల పంట పండడం ఖాయమని విమర్శకులు కూడా నీరాజనాలు పలుకుతున్నారు. అలాగే దుల్కర్, సమంత, విజయ్ దేవరకొండ వంటి ఇతర తారాగణం కూడా ఎవరి పాత్ర మేరకు వారు అద్భుతంగా నటించారు. అయితే ఇంత అద్భుతంగా సినిమా రావడానికి ప్రధాన కారణం దర్శకుడు నాగ్ అశ్విన్.

సావిత్రి చిన్నతనం నుండి మొదలైన సినిమా చివరకు విషాదంతంగా ముగిసే వరకు సినిమాను ఆసక్తికరంగా నడిపించడంలో నూటికి నూరు శాతం విజయవంతం అయ్యాడు. దీంతో ప్రస్తుతం నాగ్ అశ్విన్ పేరు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఓ రేంజ్ లో మారుమ్రోగుతోంది. ‘ఎవడే సుబ్రమణ్యం’ ద్వారా పరిచయమైన నాగ్ అశ్విన్, ఈ సినిమాతో ఒక్క మెట్టు కాదు, ఏకంగా వంద మెట్లు ఎక్కారని చెప్పడంలో సందేహం లేదు.

కాసేపు సావిత్రి బయోపిక్ పక్కన పెడితే, ఇటీవల బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ నుండి తేజ తప్పుకోవడం, ప్రస్తుతం దర్శకుడు కోసం బాలయ్య అన్వేషించడం తదితర సంగతులు కూడా సినీ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. దీంతో సావిత్రి జీవితచరిత్రను అద్భుతంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ చేతికి ఎన్టీఆర్ బయోపిక్ ఇస్తే బాగుంటుందనే టాక్ ఊపందుకుంది. మరి ఈ మాట బాలయ్య వరకు చేరిందో లేదో గానీ, కళ్ళు మూసుకుని ఎన్టీఆర్ బయోపిక్ ను నాగ్ అశ్విన్ కు ఇచ్చేయోచ్చన్న టాక్ హల్చల్ చేస్తోంది.