NTR Bigg Boss Telugu!
చప్పగా సాగుతున్న తెలుగు ‘బిగ్ బాస్’కు జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ కొండంత అండగా నిలుస్తుంటే, మరో పక్కన ముమైత్ ఖాన్ పెనుభారంగా మారుతోంది. గత వారం ఎలిమినేట్ కావాల్సిన ముమైత్ ను తీసుకువెళ్ళి సీక్రెట్ రూమ్ లో కూర్చోపెట్టి ఇస్తోన్న స్పెషల్ ట్రీట్మెంట్ వీక్షకులకు అత్యంత చిరాకును తెప్పిస్తోంది. తెలుగు రాక ఆమె పడుతున్న పాట్లు, హిందీ, ఇంగ్లీష్ లలో ఆమె మాట్లాడుతున్న తీరుతో విసిగిపోయిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ‘క్విట్ ముమైత్’ అన్న నినాదాన్ని అందిపుచ్చుకున్నారు.

అంతేకాదు ఇప్పటివరకు ప్రసారమైన ‘బిగ్ బాస్’ ఎపిసోడ్స్ లో బుధవారం నాడు ప్రసారమైన ఎపిసోడ్ అత్యంత చెత్తదంటూ ట్విట్టర్ వేదికగా తమ భావాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా హౌస్ లోని ఇతర పార్టిసిపెంట్స్ సీక్రెట్స్ ను ముమైత్ కు తెలియజేసేలా చేసి, ‘బిగ్ బాస్’ మాదిరి ఆమె ఆర్డర్స్ ఇచ్చే విధానం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిందని చెప్పాలి. అయినా అసలు ఎలిమినేట్ చేయాల్సిన వ్యక్తికి ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటి? అంటూ సోషల్ మీడియా వేదికగా గుప్పిస్తున్న ప్రశ్నలు అనేకం.

ప్రేక్షకుల తీర్పు మేరకు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఇంటికి పంపిస్తున్న ‘బిగ్ బాస్’ ఈ సారి ప్రేక్షకుల తీర్పును ఎందుకు పాటించలేదు? ఇప్పటికే ఓటింగ్ సరళిపై ప్రేక్షకులలో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మహేష్ కత్తి ఎలిమినేట్ అయిన రోజున సోషల్ మీడియాలో అనేక సందేహాలు వెలువడ్డాయి. తాజాగా ముమైత్ విషయంలో ఎలిమినేషన్ కు విరుద్ధంగా సాగుతుండడం అనేది, ఏకంగా ‘బిగ్ బాస్’ షోపైనే మచ్చ పడేలా చేస్తోంది. ‘ము…ము…ము…’ అంటూ రచ్చ చేస్తున్న ముమైత్ ను భరించడం మా వల్ల కాదు అనేది ప్రేక్షకుల ఫైనల్ తీర్పు!