ntr-accident-srinivas-reddy-opens-in-interviewతెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికలలో ప్రచారం చేస్తూ ఖమ్మం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన జూనియర్ ఎన్టీఆర్ వాహనం మార్గమధ్యంలో భారీ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో నుండి బయటపడ్డ ఈ సంఘటనలో కమెడియన్ శ్రీనివాస రెడ్డి ప్రత్యక్ష సాక్షి. దీంతో ఈ మొత్తం ఎపిసోడ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

నిజానికి ఆ ఎన్నికల ప్రచారం చాలా బాగా ప్లాన్ చేసారని, ఓ వైపు బహిరంగ సభలలో తనదైన ప్రసంగాలు చేస్తున్న తారక్ కు బోర్ కొట్టకుండా రోజుకో మిత్రులను తనతో కలిసే విధంగా ప్లాన్ చేసారని, అలా చివరకి వచ్చే సరికి ఖమ్మంలో భారీ బహిరంగ సభ చాలా బాగా జరిగిందని, మునుపటి మీటింగ్స్ లో కంటే జనం బాగా వచ్చారని, అలా ముగిసిన తర్వాత హైదరాబాద్ బయలుదేరే సమయంలో నిజానికి తారక్ కారులో తానూ కూర్చోవాలని, అయితే తన బ్యాగ్ తీసుకుని వచ్చే సమయానికి మరొక వ్యక్తి ఆ కారు ఎక్కడంతో, వెనుక కారులో ఎక్కి హైదరాబాద్ కు బయల్దేరామని తెలిపాడు శ్రీనివాస్ రెడ్డి.

అయితే ఆ సంఘటన జరిగిన ప్రాంతంలో చాలా పెద్ద మలుపు ఉందని, అప్పటికీ తారక్ బాగా కట్ చేసారని, కానీ ఈ లోపుల కారు పల్టీలు కొట్టడంతో ప్రమాదం జరిగిపోయిందని, తానూ కారు దగ్గరికి వెళ్లి చూసే సమయంలో తారక్ కారులో లేడని, ఎవరో ఒక వ్యక్తి పిచ్చోడులా ఒంటి నిండా మట్టి వేసుకుని ఉంటే, తీక్షణగా చూస్తే అతడే తారక్ అని గమనించి, ఆ పరిసర ప్రాంతంలో ఉన్న తన బంధువులకు ఫోన్ చేసి ఎవరికీ చెప్పవద్దని, ఒక హాస్పిటల్ వద్దకు తీసుకువెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి, తర్వాత కిమ్స్ కు వెళ్లామని అన్నారు.

అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఒక వ్యక్తి… ‘నువ్వు రావడం వలనే ఈ యాక్సిడెంట్ జరిగిందని’ అనడంతో, తనకు కోపం వచ్చి, ‘నేను రావడం వలనే తారక్ ప్రాణాలతో బయటపడ్డాడని’ కాస్త గట్టిగానే చెప్పానని, బహుశా ఈ విషయం ఏమైనా తారక్ దాకా వెళ్లిందో ఏమో గానీ, అప్పటినుండి తారక్ తో తనకు కాస్త దూరం పెరిగిన మాట వాస్తవమేనని అన్నారు. నిజానికి ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఒక పెద్ద బావి ఉందని, కాస్త అటు ఇటు అయినా కారు ఆ బావిలో పడేదని, అదృష్టవశాత్తు అలా జరగలేదని, తనకు తారక్ కు మధ్య పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు శ్రీనివాస్ రెడ్డి.