ntr about mahesh 1 nenokkadine movieసుకుమార్ సినీ కెరీర్ ను విశ్లేషించాలంటే “1 నేనొక్కడినే” సినిమాకు ముందు ఆ తర్వాత అని చెప్పాలి. అంతలా ప్రాధాన్యత దక్కించుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి చప్పుడు చేయకుండా వెళ్ళిపోయింది. అయితే ఈ సినిమాను ఇష్టపడే సినీ అభిమానులకు కొదవలేదు. ఒక్క ప్రిన్స్ అభిమానులే కాదు, చాలా అరుదుగా సినిమాలను వీక్షించే వారిని కూడా అమితంగా ఆకట్టుకున్న చిత్రంగా “1 నేనొక్కడినే” సినిమా నిలిచింది.

ఈ సినిమాను అమితంగా ఇష్టపడే వారి జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారన్న విషయం తాజాగా బహిర్గతమైంది. “నాన్నకు ప్రేమతో” సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో… “నాన్నకు ప్రేమతో” సినిమా స్క్రీన్ ప్లేలో ఎలాంటి గందరగోళం లేకుండా జాగ్రత్త వహించడం అనేది ‘1’ సినిమా ఫలితం ప్రభావమేనా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన జూనియర్ ఎన్టీఆర్… “1 నేనొక్కడినే” అనే సినిమా ఫ్యాబులస్, ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం… అంటూ బదులిచ్చారు. ఒక్కో సినిమాకు దర్శకుడు ఒక్కో స్క్రీన్ ప్లే రాసుకుంటారని, ఆ సినిమాకు అది రాస్తే, “నాన్నకు ప్రేమతో” సినిమాకు ఈ స్క్రీన్ ప్లే సుకుమార్ రాసుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు.

ఇక, సుకుమార్ పై జూనియర్ కురిపించిన ప్రశంసలకు కొదవే లేదు. “తనతో ఒక సినిమా కాదు, మరో రెండు, మూడు సినిమాలు చేయాలని ఆశగా ఉందని, “నాన్నకు ప్రేమతో” సినిమా ద్వారా నాతో పాటు అందరికీ గొప్పగా నటించే అవకాశాన్ని సుకుమార్ కల్పించారని, ఆయన్ని ఒక్క ‘పదం’లో వర్ణించడం తనకు సాధ్యం కాదని, ప్రపంచ దర్శకుడిగా సుకుమార్ వెలుగొందాలని, ఆ సమయం కోసం నిజంగా ఎదురు చూస్తున్నానని” దర్శకుడు సుకుమార్ ప్రతిభను జూనియర్ ఎన్టీఆర్ కొనియాడిన విధానం వీక్షకులను ఆకట్టుకుంది.