Notice to vacate  Chandrababu Naidu Residence మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎలాగైనా ఉంటున్న ఇంటి నుండి ఖాళీ చేయించాలని కృతనిశ్చయంతో ఉంది జగన్ ప్రభుత్వం. ఇందుకు వేగంగా పావులు కదుపుతుంది. ప్రజావేదిక కూల్చివేత పూర్తి కాగానే ఈ ఉదయం చంద్రబాబు ఉంటున్న ఇంటికి నోటీసులు అంటించారు సీఆర్డీఏ అధికారులు. ఇంటి యజమానికి కూడా నోటీసు పంపనున్నట్టు తెలుస్తుంది. ఇళ్లు ఖాళీ చేయించి పడగొట్టాలని లేనిపక్షంలో ప్రభుత్వమే కూల్చివేస్తుందని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.

వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులు ఆదేశించారు. నోటీసులకు వివరణ ఇవ్వకపోతే భవనాలు తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం తన నివాసం మార్చుకుని.. జడ్ ప్లస్ కేటగిరి భద్రతకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు చంద్రబాబు భవనాన్ని ఖాళి చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ ఆయన ఉండటానికి మరో భవంతి కోసం అన్వేషణ మొదలు పెట్టారు.

అలాగే చంద్రబాబు రాజధానిలో సొంత ఇల్లు కూడా నిర్మించుకుంటారని తెలుస్తుంది. దాని కోసం స్థల అన్వేషణ చేస్తున్నారు పార్టీ నాయకులు. ఈ చర్య ద్వారా చంద్రబాబునే టార్గెట్ చేసినట్టు స్పష్టం అవుతున్నప్పటికీ అటువంటి అభిప్రాయం కలగకుండా కరకట్టకు మధ్యలో నిర్మించిన అనేక అక్రమ కట్టడాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మొత్తం 50 కట్టడాలు అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారని ఇవాళ నోటీసులు జారీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.