pawan-kalyanరోజుకొక విషయంపై స్పందిస్తున్న ‘జనసేన’ అధినేత ఆదివారం నాడు ‘ప్రత్యేక హోదా’పై స్పందిస్తూ… తన అభిప్రాయాలను తెలియజేసారు. ‘ప్రత్యేక హోదా’ స్థానంలో ఇచ్చిన ‘ప్రత్యేక ప్యాకేజ్’లో అసలు విషయం లేదని, ‘ప్రత్యేక’ అన్న పదమే ప్రత్యేకంగా చేర్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా భారతీయ జనతా పార్టీ విధానాలు అవలంభిస్తోందని, ‘జై ఆంధ్రా’ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 400 మందిపై ప్రమాణంపై చేసి చెప్తున్నా… సమాధానం చెప్పకుండా వ్యవహరిస్తున్న బిజెపిని వదిలేది లేదని అన్నారు.

అయితే పవన్ ఇవేమీ కొత్తగా చెప్తున్నవి కావు. గతంలో బహిరంగ సభలలో చెప్పినవే. ‘రెడ్డి గారొచ్చారు కధ మొదలుపెట్టండి’ అన్న చందంగా మళ్ళీ కొత్తగా ట్విట్టర్ ద్వారా చెప్పడం… కేవలం క్రియాశీలక రాజకీయాలకు కాస్త దగ్గరగా ఉండాలన్న ఒక్క విషయమేనా? నిజంగా పవన్ అలాగే ఉండాలనుకుంటే… తీసుకోవాల్సిన ‘స్టాండ్’ వేరే ఉంటుంది. అలాగే పోరాటాలు చేయాల్సిన ప్రజా సమస్యలకు కొదవలేదు. కానీ, అలా కాకుండా సోషల్ మీడియా ద్వారా పవన్ చేస్తున్న ఈ విమర్శలు, నిలదీతలను మన వర్తమాన రాజకీయ నాయకులు పట్టించుకుంటారనుకుంటే, అంతకు మించిన అవివేకం మరొకటి ఉండదు.

కేవలం మీడియా వర్గాల స్క్రోలింగ్ న్యూస్ లకు సరిపోతాయి తప్ప, పవన్ చేసిన ఈ ట్వీట్ల ప్రభావం రాజకీయాలపై గానీ, నేతలపై గానీ ఉండదన్న విషయాన్ని గమనించాలి. ఒక్క ‘ప్రత్యేక హోదా’ విషయమే కాదు, ‘జనసేన’ అధినేత ఇప్పటివరకు చెప్పిన అన్ని అంశాలలో ఒక్క ‘దేశభక్తి’ మినహాయిస్తే… మిగతావన్నీ కూడా గతంలో ప్రస్తావించినవే, అందులోనూ అవి వర్తమానానికి దూరంగా ఉన్నవి కావడం మరో విశేషం. ఈ ట్వీట్ల ద్వారా పవన్ సాధించుకున్నది ఏమైనా ఉంటుంది అంటే… అది కేవలం ట్విట్టర్లో ఫాలోయర్స్ ను పెంచుకోవడం తప్ప, ఏమీ లేదన్న వ్యంగ్యాస్త్రాలు రాజకీయ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి.