notes-ban-saves-girl-from-prostitution-alwarపెద్ద నోట్ల రద్దు వలన బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడి అశువులు బాసిన వారి గురించి విన్నాం… అలాగే ఈ రద్దు నిర్ణయం వలనే బ్యాంకులలో పని ఒత్తిడిని తట్టుకోలేక పలువురు బ్యాంకు అధికారులు గుండె పోటుతో మరణించిన ఘటనలు నమోదయ్యాయి… అలాగే హాస్పిటల్స్ లో తగినన్ని డబ్బులు కట్టలేకపోవడంతో చికిత్స అందక మరికొందరు మరణించారు… ఇంకొందరి వివాహాలు కూడా ఆగిపోయాయి… కానీ, ఈ నోట్ల రద్దు నిర్ణయం వలన ఒక యువతి జీవితం బుగ్గిపాలు కాకుండా కాపాడిందన్న ఘటన రాజస్తాన్ లోని అల్వార్ జిల్లాలో వెలుగు చూసింది.

వ్యభిచార గృహాలకు అమ్మాయిలను సరఫరా చేసే ముఠాతో 20 లక్షల రూపాయలకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అంత సజావుగా జరిగితే ఈ పాటికి సదరు మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం గానీ, ఇంతలో పాత నోట్లు రద్దు అన్న మోడీ ప్రకటన వెలువడింది. దీంతో, సదరు ఏజెంట్ తెచ్చిన పాత కరెన్సీని తీసుకునేందుకు యువతి బంధువులు అంగీకరించలేదు. అలాగని చెక్కు తీసుకునేందుకూ ఒప్పుకోలేదు. దీంతో తాత్కాలికంగా డీల్ రద్దు అయినప్పటికీ, మళ్ళీ తనను అమ్మేస్తారన్న భయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో మొత్తం ఉదంతం వెలుగులోకి వచ్చింది.

తన విక్రయంపై సోదరులతో గొడవ పడి లాభం లేదనుకున్న ఆమె, తమ సహాయం కోరిందని అల్వార్ అడిషనల్ ఎస్పీ పరాస్ జైన్ వెల్లడించారు. ఆపై ఓ మహిళా కానిస్టేబుల్ ను ఆమె వెంట పంపి మహిళా పీఎస్ లో ఫిర్యాదు చేయించామని, సవాయ్ మధోపూర్ జిల్లాకు చెందిన ఈమెను సోదరులు, బావ ఓ స్నేహితుడి ఇంట్లో పార్టీ ఉందని చెప్పి తీసుకు వచ్చారని, అక్కడ ఈ విక్రయం జరిగిందని జైన్ తెలిపారు. ఈ ఘటనలో తన తండ్రి పాత్ర కూడా ఉందని బాధితురాలు ఫిర్యాదు చేసిందని తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయం ఈ రకంగా ప్రభావితం చేస్తుందని బహుశా ఎవరూ ఊహించకపోవచ్చు.