notes-ban-future-annoucementపెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రకటనతో దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురైన విషయం తెలిసిందే. దీనిపై ప్రజల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. కొంత గడువు ఇచ్చి రద్దు విషయం ప్రకటించినట్లయితే బాగుటుందన్న అభిప్రాయాలను ఎక్కువ శాతం ప్రజలు వ్యక్తపరచగా, మరికొందరు మాత్రం దేశం కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమనే మానసిక ధైర్యాన్ని వెలిబుచ్చారు.

అయితే ఈ సారి మాత్రం మానసికంగా అన్నింటికీ సిద్ధం అవ్వమని ఆర్ధిక శాఖ వ్యవహారాల కార్యదర్శి శశికాంత్ దాస్ గుప్తా స్పష్టం చేసారు. ప్రస్తుతం వెలువడుతున్న విమర్శల రీత్యా… ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు మరో బాంబు పేల్చారు. త్వరలో మనుగడలో అన్ని కరెన్సీలను ఉపసంహరిస్తామని, వాటి స్థానంలో అధునాతన డిజైన్ లతో కూడి మరింత సెక్యూరిటీ ఉండేలా సరికొత్త నోట్లను రూపొందిస్తామని తెలిపారు. చూడబోతుంటే… ముందుంది ముసళ్ళ పండగ అన్న రీతిలో కేంద్ర ప్రభుత్వం సంకేతాలను ఇస్తోంది.

5, 10, 20, 50, 100 రూపాయల నోట్లు కూడా రద్దు కానున్నాయని శశికాంత్ చేసిన ప్రకటనతో ప్రస్తుతం చేతిలో ఉన్న వంద రూపాయల కరెన్సీ కూడా భవిష్యత్తులో బ్యాంకులలో ఇచ్చి తిరిగి తీసుకోవాలన్న భావన ప్రజలలో ఏర్పడింది. అయితే దీనికి ఎప్పుడూ ముహూర్తం పెడతారో అన్న సందేహం మాత్రం ప్రజలలో వెన్నాడుతోంది. అంటే ఇప్పటి నుండి కొత్త కరెన్సీ నోట్లను మాత్రమే భద్రపరచుకోవాలన్న మాట. అలాగే ప్రస్తుతం రద్దయిన 1000 రూపాయల నోటు స్థానంలో కూడా సరికొత్త నోటును ప్రవేశపెడతామని స్పష్టం చేసారు.