Notes Ban Affect Common People “ఓ పక్కన ఇల్లు తగలబడిపోతోంది అని ఒకడు ఏడుస్తుంటే… నా పేలాలు ఎగలేదుగా…” అన్నాడంట మరొకడు. ప్రస్తుతం జనాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఓ పక్కన 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో తగినంత చిల్లర లేక ప్రజలు గగ్గోలు పెడుతుంటే… మరో పక్కన అవే నోట్లను ఎక్స్చేంజి చేసుకున్న మరికొందరు 2000 రూపాయలతో సెల్ఫీలు దిగుతూ ఫోటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ప్రజల ‘సెల్ఫీ’ పైశాచికత్వం ఏ స్థాయికి చేరుకుందో అని చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా ‘సెల్ఫీ’ మాయలో పడి మరో వైపు ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు నమోదవుతుండగా, ప్రజలకు ఈ సెల్ఫీ పిచ్చి మాత్రం వదలడం లేదు. ఉండొచ్చు… అయితే దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అలా కాకుండా శవం దగ్గర కూడా నేను వైరేటీగా నవ్వుతాను అంటే… ఎలా ఉంటుందో… ప్రస్తుత 2000 రూపాయల పరిస్థితి కూడా అలాగే ఉంది.

నిజానికి ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ఎంత అభినందించదగ్గ విషయమైనా, ప్రయాణాలలో ఉన్న వారు, సామాన్య ప్రజానీకం చాలా ఇబ్బందులు పడుతున్నారు. చంటి బిడ్డలకు పాలు కొనుక్కోవడానికి చేతిలో 500, 1000 ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అలాంటి గడ్డు పరిస్థితి నుండి బయట పడాల్సింది పోయి, ఫలానా బ్యాంకు నుండి తమకే ముందు 2000 రూపాయల నోటు వచ్చిందంటే… తమకే ముందు వచ్చిందని సదరు నోటు పట్టుకుని ఇస్తున్న వింత వింత హావభావాలకు ‘దేవుడా….’ అనుకోవడం తప్ప ఏమీ చేయలేం.

ఏదో చిన్న పిల్లలు క్రేజీ సెల్ఫీ మోజులో చేసారు అనుకుంటే… తెలిసి తెలియని వయసు గనుక… ఓ నవ్వు నవ్వి సరిపెట్టుకుంటాం, అలా కాకుండా… పరిపక్వత కలిగిన వయసులో ఉన్న వారు కూడా అలాగే ప్రవర్తిస్తే… దానిని పిచ్చి అని పిలవాలో.., మోజు అని పిలవాలో.., తెలియని పరిస్థితి.