Jagan chandrababu, andhra pradesh, YSRCP, YSR rajashekar reddy, TDP  గత రెండు, మూడు సంవత్సరాలుగా సమయం చిక్కినప్పుడల్లా తెలుగుదేశం నేతలు జగన్ గురించి ప్రస్తావించిన సమయంలో…. ‘ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకుని తన ప్రవర్తనను మార్చుకోవాలని’ సూచనలు చేసారు. ఒక్క తెలుగుదేశం నేతలే కాదు, రాజకీయ నిపుణులు, విశ్లేషకులు కూడా వివిధ సందర్భాలలో జగన్ తీరును గురించి ప్రత్యేకంగా విశ్లేషణలు చేసారు. అంతా దాకా ఎందుకు, వైసీపీ నేతలే చాటుమాటునో లేక పార్టీ మారిన సందర్భాలలోనో జగన్ వైఖరి గురించి ఏకరువు పెట్టిన సందర్భాలు కోకొల్లలు.

ఎవరెన్ని చెప్పినా, ఎంత హితవు పలికినా… జగన్ విధానంలో ఇసుమంత మార్పు కూడా కనపడలేదు. మార్పు తీరు పక్కన పెడితే… నానాటికి మరింతగా తన స్థాయి తానే దిగజార్చుకునే విధంగా ప్రవర్తిస్తున్న వైనం, ఆ పార్టీ నాయకుల భవిష్యత్తును డోలాయమానంలో పడేస్తోంది. వారి భవిష్యత్తును పక్కన పెడితే… “జగన్ మారరు” అన్న విషయమైతే దాదాపుగా ఖరారైంది. ప్రస్తుతం ‘చంద్రబాబు – జగన్’ల తీరును చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు మరో సందేహం కూడా కలుగుతోంది.

ఏపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా? లేక జగన్ మోహన్ రెడ్డా? అన్న తీరులో కూడా చర్చించుకుంటున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న వారు ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో మండిపడుతూ ఉంటారు. గతంలో చంద్రబాబు సిఎంగా ఉన్న తరుణంలోనూ, అలాగే వైఎస్ హయంలోనూ వారిదే ఆధిపత్యం. అసెంబ్లీ వేదికలుగా ప్రతిపక్ష నాయకులపై ఆ ఇద్దరూ ఒక ఆట ఆడుకునే వారు. కానీ, గత రెండేళ్ళుగా చంద్రబాబు, జగన్ ప్రసంగాల తీరును పరిశీలిస్తే… జగన్ పై చంద్రబాబు చేసిన విమర్శల కన్నా… చంద్రబాబుపై జగన్ మండిపడ్డ సందర్భాలే ఎక్కువ.

జగన్ ఇన్ని విమర్శలు చేస్తున్నా ఉపేక్షిస్తూ చాలా ‘లైట్’ తీసుకోవడం సిఎం చంద్రబాబు వంతవుతోంది. నిజానికి 11 కేసుల్లో ఏ-1 నిందితుడిగా ఉంటూ కూడా ప్రభుత్వంపై మరియు ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో పదజాలాన్ని వినియోగించాలంటే కాస్తంత ధైర్యం కావాలి. మరి జగన్ కున్నది ధైర్యమో, మొండితనమో లేక అవివేకమో గానీ… అదీ గాక అధికార ప్రభుత్వ చేతగానితనమో గానీ… ఒక సిఎంపై ఈ రేంజ్ లో వ్యాఖ్యలు చేస్తున్నారంటే… ఒక విషయం స్పష్టమవుతోంది. అదే… “ఇక మారాల్సింది జగన్ కాదు… చంద్రబాబు అని..!”

జగన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురం జిల్లాలో జరుగుతున్న జగన్ పర్యటనను అడ్డుకోవడానికి టిడిపి నేతలు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకోవడం విశేషం. అధికారంలో ఉన్న వారినే అడ్డుకుని, అరెస్ట్ చేయడం అనేది కేవలం పారదర్శకతను సూచిస్తుందేమో గానీ, మరో వైపు జగన్ కు కొండంత బలాన్ని అధికార పక్షమే కలుగజేస్తుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇదే పరిస్థితులలో వైఎస్ రాజశేఖర్ రెడ్డో లేక జగన్ మోహన్ రెడ్డో ముఖ్యమంత్రిగా ఉండి.. మరొకరు వారిపై ఇలాంటి వ్యాఖ్యలే చేస్తే… చేసిన వారి పరిస్థితి ఈ పాటికి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు.

‘మంచితనాన్ని పిచ్చితనం’గా అర్ధం చేసుకుంటే… అది అర్ధం చేసుకునే వారి తప్పు కాదు… వాళ్ళు అలా తీసుకుంటున్నారు తెలిసి కూడా… అదే మంచితనాన్ని ప్రదర్శించడం… ఇతరుల అవివేకమవుతుంది. ప్రస్తుతం ‘చంద్రబాబు – జగన్’ ఎపిసోడ్లలో జరుగుతున్న తీరు కూడా ఇదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి ఇప్పటికైనా చంద్రబాబు తీరులో మార్పు వస్తుందో లేదో చూడాలి!