Mudragada Padmanabhamనిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాపు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇటీవలే కేంద్రం అగ్రవర్ణాల పేదలకు తెచ్చిన 10% రిజర్వేషన్ల లో కాపు, బలిజ, తెలగ కులాలకు 5% రిజర్వేషన్ కేటాయించాలంటూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది. దీనిపై కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రాష్ట్రంలోని కాపు ఐకాస నాయకులతో సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో ముద్రగడ వ్యవహార శైలిపై ఇతర నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సమావేశం మొత్తం ముద్రగడ శాసనసభ చేసిన ఈ తీర్మానం వల్ల కాపులకు ఉపయోగం లేదు అన్నట్టుగానే మాట్లాడారట. ఐకాస కూడా అదే విధంగా తీర్మానం చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వారిపై ఒత్తిడి చేశారట. అయితే దానికి మిగతా నాయకులు ఒప్పుకోలేదు. ఇటువంటి విషయంలో తొందర పాటు వలదని ఒకవేళ నిజంగానే కోర్టులు శాసనసభ చేసిన తీర్మానం కొట్టి పారేస్తే అప్పుడే స్పందించాలని అప్పటి వరకు ఈ విషయం పై వేచి చూడాలని వారు అభిప్రాయపడ్డారు.

“ముద్రగడ పద్మనాభం కాపు పక్షపాతి అని అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు మీద ఉన్న కోపంతో ఆయన వాస్తవాలు చూడలేకపోతున్నారు. రాజకీయ లబ్ది కోసమే అనుకున్నా టీడీపీ తప్ప రాష్ట్రంలో ఈరోజున ఏ పార్టీ కూడా కాపు రిజర్వేషన్లను సీరియస్ గా తీసుకోవడం లేదు అనేది వాస్తవం. ఆ ఒక్క పార్టీని కూడా అడుగడుగునా ఇబ్బంది పెట్టడం మంచి పద్దతి కాదు. పైగా ఇది కాపులపై సమాజంలో మంచి అభిప్రాయం కలిగించదు,” అని సమావేశానికి హాజరైన ఒక నాయకుడు అభిప్రాయపడ్డారు.

మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ముద్రగడ రాజకీయాలలోకి తిరిగి వస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆయన బీజేపీలో గానీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో గానీ చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆయనతో తరచు టచ్ లో ఉంటున్నారు. బీజేపీ సహా ఇంఛార్జ్ సునీల్ దేవధర్ కొద్ది నెలల క్రితమే ఆయనను కలిసి అమిత్ షా తరపున ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.